24 సీట్లను గెలుచుకుందాం :పవన్ అంత ధీమా ఏంటి ?

చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ కలిసి  మొదటి జాబితా ప్రకటించారు. టిడిపి 94, జనసేన అభ్యర్థులు ఐదుగురు పేర్లను వెల్లడించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల్లో అసంతృప్తులు వ్యక్తం అయ్యాయి. చాలామంది నేతలు బాహటంగానే తమ సంతృప్తిని వెళ్ళగక్కారు. మరోవైపు జనసేనకు తక్కువ అసెంబ్లీ స్థానాలు కేటాయించారని ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. అటు కాపు సామాజిక వర్గం సైతం ఆగ్రహంగా ఉంది. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలా అయితే కాపు ఓట్లు కూటమి అభ్యర్థులకు బదిలీ కావని తేల్చి చెప్పారు. జనసేన సీట్లు పెరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వ్యక్తం అవుతున్న విమర్శలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఎన్నికల్లో జనసేన 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సీనియర్లు కోరుకుంటున్నారని.. ఇదే విషయంపై తనకు సలహా ఇచ్చారని.. గత ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించగలిగితే.. వారు అడుగుతున్నట్టు 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు అడిగే వాడినని పవన్ తేల్చి చెప్పారు. జనసేనకు సీట్లతో పనిలేదని…పొత్తులో భాగంగా లభించిన సీట్లలో గెలిస్తే చాలని చెప్పడం విశేషం. పొత్తులో భాగంగా దక్కిన సీట్లలో గరిష్టంగా గెలుచుకోవాల్సిన బాధ్యత జనసేన పై ఉందని.. అందుకు మీరంతా కృషి చేయాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. ఏపీ భవిత కోసమే కూటమిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా బిజెపికి కొన్ని స్థానాలు కేటాయించాల్సి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే బీజేపీతో చర్చలు పూర్తయ్యాయని.. ఆ పార్టీ కూటమిలో చేరిన తర్వాతే సీట్ల సంఖ్య పై స్పష్టత వస్తుందని చెప్పారు.ఏపీ భవిష్యత్తు కోసమే తాను కూటమిలో చేరినట్లు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేనలో నిబద్ధత కలిగిన జనసైనికులు అందరికీ తగిన పదవులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వైసిపి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడడమే ఈ కూటమి ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ కోసం జనసైనికులు అవమానాలు పడుతున్నారని.. వారి దౌర్జన్యాలు, వేధింపులను భరిస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీని ఈ రాష్ట్రం నుంచి దూరం చేయడమే జనసేన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా జనసైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు.