ఆంధ్రలో గంజాయి దుకాణాలు బంద్ @ నీరబ్ కుమార్
జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిపోయింది అనడం లో అతిశయోక్తి లేదు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని తేలింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మృగ్యమై, పనుల లేక యువత గంజాయి మత్తుకు అలవాటుపడేలా ప్రభుత్వ విధానం సాగింది. ఇప్పుడు ఆ మహమ్మారిని సమూలంగా పెకలించివేయడానికి ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో గురువారం జరిగిన నార్కో కో ఆర్డినేషన్ సెంటర్ అపెక్స్ లెవల్ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన పేరిట గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు.ముఖ్యంగా ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.నియంత్రణకు సంబంధించి ప్రత్యేక టాస్కు ఫోర్సును ఏర్పాటు చేయడంతో పాటు పెద్దఎత్తున చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. గంజాయి,ఇతర మత్తు పదార్ధాల నిషేధానికి సంబంధించి వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రాంగ ణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్ధుల్లో ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై గట్టి నిఘా ఉంచడం జరిగిందని ఇందుకై ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశామనినీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు.గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నయ జీవనోపాధి కల్పించే పంటలు పండించే విధంగా చైతన్యం తీసుకురావడంతో పాటు కాఫీ,రాగి, నిమ్మ,నారింజ వంటి విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.గంజాయి,ఇతర మత్తు మందుల నియంత్రణను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన రాష్ట్ర,జిల్లా స్థాయి నార్కో-కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకువచ్చేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా పాఠశాలలు,కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు
Comments
0 comment