ఆంధ్రలో కాంగ్రెస్ గెలిచేది ఇక్కడే ?
ఆంధ్ర లో అందరి దృష్టి ఆకర్షిస్తోంది సింగనమల నియోజకవర్గం. ప్రస్తుతం అధికార వైసిపి, ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంది. అదే సమయంలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. వీరిలో డాక్టర్ కిల్లి కృపారాణి, జెడి శీలం, పల్లం రాజు, సాకే శైలజానాథ్.. ఇలా చాలామందిని అభ్యర్థులుగా ప్రకటించింది. వివిధ కారణాలతో వైసిపి నుంచి వచ్చిన వారికి సైతం టికెట్లు కట్టబెట్టింది.పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వైసిపి ఓటు బ్యాంకు చీల్చేందుకే రంగంలోకి దిగింది అన్న కామెంట్స్ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో సింగనమలకు చోటు దక్కడం విశేషం.రెండు వారాల కిందట వరకూ సింగనమల నియోజకవర్గం లో వైసీపీ వర్సెస్ ఎన్ డి ఏ కూటమి అన్నట్టు పరిస్థితి ఉండేది.కానీ కాంగ్రెస్ హై కమాండ్ సాకే శైలజానాథ్ పేరు ప్రకటించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. శైలజనాథ్ గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకపోవడంతో నష్టపోయారు. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో మరోసారి తెరపైకి వచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. సింగనమలలో సామాజిక సమీకరణలు కీలకం. అధికార విపక్ష కూటమి అభ్యర్థులకు ఆ పార్టీల నుంచి అంతగా మద్దతు దొరకడం లేదని తెలుస్తోంది. ఇదే అదునుగా శైలజానాథ్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రయత్నాలు గట్టిగానే వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తోంది.గతంలో ఈ నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా శైలజనాథ్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తెప్పించి అభివృద్ధి చేశారు. ఇప్పుడు అదే అభివృద్ధిని ప్రస్తావించి శైలజనాథ్ ఓట్లు అడుగుతున్నారు. ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శైలజనాథ్ కేవలం కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. దాదాపు అన్ని పార్టీల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే శైలజానాథ్ తన గెలుపు కోసం ప్రజలను కలుపు కెళ్లే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్రత్యర్థులకు కలవరపాటుకు గురి చేస్తుంది.ఇక్కడ వైసిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉండేవారు. ఆమె గెలిచే ఛాన్స్ లేకపోవడంతో వైసిపి అభ్యర్థిని మార్చాలనుకుంది. అయితే పద్మావతి భర్త సాంబశివారెడ్డి తాము చెప్పిన వారికే సీటు ఇవ్వాలని పట్టుబట్టారు. తన వద్ద టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరాంజనేయులు కు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే పేరుకే వీరాంజనేయులు అభ్యర్థి కానీ.. వెనుక ఉన్నది సాంబశివారెడ్డి అని అందరికీ తెలుసు. ఒకవేళ వీరాంజనేయులు గెలిచిన సాంబశివారెడ్డి పెత్తనం చేస్తారన్న ప్రచారం సింగనమలలో బలంగా వ్యాపించింది. అందుకే చాలామంది వైసిపి నేతలు సహకరించే పరిస్థితి లేదు. అటు టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి కి కూడా సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఉంది. ఆమెను మార్చాలన్న విన్నతిని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచి వారు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి టిడిపి నేతలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి శైలజనాథ్ కు మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కూడా గుర్తింపు తెచ్చి పెడుతున్న సింగనమల.. ఈ ఎన్నికల్లో ప్రత్యేకమే.
Comments
0 comment