బాబాయ్ కోసం పిఠాపురానికి అబ్బాయ్

ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రలో హాట్ టాపిక్ అయింది అలాగే పిఠాపురంలో పవన్ గెలవాలని తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కోరుకుంటోంది. ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ ఈసారి రంగంలోకి దిగింది. గత అనుభవాల దృష్ట్యా కుటుంబం యావత్ అండగా నిలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. పవన్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరుతూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. పవన్ కు సినిమాలు కంటే రాజకీయాలు ఇష్టమని.. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని.. అటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవి తేజ్ లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కు తమ మద్దతు ప్రకటించారు.

ఇటీవల రామ్ చరణ్ సైతం స్పందించారు. చిరంజీవి వీడియోను జతపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు తాము అండగా నిలబెడతామని చెప్పుకొచ్చారు. అటు స్టైలిష్ స్టార్అల్లు అర్జున్ కూడా తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.మరోవైపు చివరి రోజు చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారని టాక్ నడిచింది. అయితే దానికి తెర దించుతూ.. రామ్ చరణ్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈరోజు పిఠాపురం వెళ్లి పవన్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

మరికొద్ది గంటల్లో రామ్ చరణ్ పిఠాపురం చేరుకోనున్నారు. ఆయనతోపాటు తల్లి సురేఖ సైతం వెళుతున్నారు. ముందుగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే పవన్ తో కలిసి ప్రచారం చేస్తారా? లేక విడిగా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది