ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో వైసీపీ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఓసారి సస్పెండ్ చేయడంతో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరటపొందిన ఆయన్ను రెండోసారి బిజినెస్ రూల్స్ పేరుతో సస్పెండ్ చేశారు. అయితే ఇలా రెండోసారి సస్పెన్షన్ చేయడం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ను హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వానికి అక్కడా ఊరరట దక్కలేదు.

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కు హైకోర్టులో భారీ ఊరట ల‌భించింది. క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఉత్త‌ర్వుల‌ను స‌స్పెండ్ చేసేందుకు ఉన్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ ఇటీవ‌ల క్యాట్ ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. క్యాట్ ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేసేందుకు నిరాక‌రించింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది