ఎంత పనిచేశారు ?
సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అయ్యాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే.. అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని అధికారులు కీలక ఫైళ్లను మాయం చేసినట్లు సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. రాజధాని, ఇసుక, మద్యం, స్కిల్ కేసుల ఫైళ్లలోని కొన్ని పేపర్లు మాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని పత్రాలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సమాచారాన్ని కొంతమంది పోలీస్ అధికారులే తెలుగుదేశం కీలక నేతలకు చేరవేశారు. దీంతో వెంటనే సిట్ కార్యాలయానికి తాళం వేసి ఉన్నతాధికారులు పోలీస్ కాపలా పెట్టారు. సిట్‌తో పాటు ఇతర బాధ్యతల నుంచి వెంటనే కొల్లి రఘురామిరెడ్డిని ఉన్నతాధికారులు తప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్కిల్ కేస్‌లో హెరిటేజ్ పత్రాలను సిట్ అధికారులు తగులబెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఏపీ ఫైబర్‌నెట్ కార్యాలయంలో ఫైల్స్ గల్లంతు అని గురువారం (జూన్ 6) పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. వెంటనే పోలీసులు ఫైబర్ నెట్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఫైళ్లేమీ మాయం కాలేదని నిర్ధారించారు. ఇప్పటికే పలు కీలక కార్యాలయాల్లో ఈ ఆఫీస్ లాగిన్ ఐడీలను పోలీసులు డిజేబుల్ చేశారు. తాజాగా సీట్ ఆఫీసులో ఫైళ్ల గల్లంతు వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అన్నిటికీ మించి ఫైళ్ల గల్లంతు సమాచారం పోలీసుల నుంచే రావడంతో సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
Comments
0 comment