కూటమికి ఓటువెయ్యమని అభ్యర్ధిస్తున్న కృష్ణం రాజు భార్య ,ప్రభాస్ పెద్దమ్మ

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి గాలి బాగా వీస్తుంది ,దివంగత నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు బీజేపీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎంపీగా, కేంద్రమంత్రిగా సేవలందించారు. ఇప్పుడు కృష్ణంరాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఆయన సతీమణి శ్యామలాదేవి తీసుకున్నారు. కృష్ణంరాజు తరపున బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి ఆమె రంగంలోకి దిగారు.నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు మద్దతుగా శ్యామలాదేవి ప్రచారం నిర్వహించారు. మొదట మొగల్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె, అనంతరం నరసాపురంలో మత్స్యకారుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇటీవల శ్యామలాదేవి వైసీపీలో చేరనున్నారంటూ కొన్ని న్యూస్ చక్కర్లు కొట్టాయి. కూటమి తరపున ప్రచారం చేసి, ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టారు శ్యామలాదేవి.ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి ఎందరో కూటమికి మద్దతు తెలిపారు. ఇప్పుడు శ్యామలాదేవి కూటమి అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించడంతో.. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులంతా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశముంది.