మారిన చంద్రబాబు ప్రమానస్వీకారం వేదిక

ఆంధ్రప్రదేశ్  ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. మూడు పార్టీలు జోష్ మీద ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కూటమి 164 స్థానాల్లో విజయం సాధించగా.. వైసిపి కేవలం 11 స్థానాలకి పరిమితం అయింది. టిడిపి సొంతంగా 135 స్థానాల్లో గెలుపొంది జోష్ మీద ఉంది. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే ముందుగా అనుకున్నట్టు కాకుండా వేదికను మార్చినట్లు తెలుస్తోంది.తొలుత మంగళగిరిలో ప్రమాణ స్వీకార ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గన్నవరం విమానాశ్రయానికి అత్యంత చేరువులోని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పొలాలను చదును చేసే పనిలోపడ్డారు. ప్రస్తుతం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ప్రముఖ ఆర్కిటెక్ట్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. భద్రత, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా వేదిక మార్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు 50 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే భద్రతకు పెద్దపీట వేస్తూ వేదికను మార్చినట్లు తెలుస్తోంది.

జాతీయ నాయకులంతా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మంగళగిరిలో అయితే ఎయిర్ పోర్ట్ నుంచి 22 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అదే గన్నవరం సమీపంలో ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితి ఉండదు. అందుకే మంగళగిరి కాకుండా గన్నవరాన్ని ఎంచుకున్నారు. కాగా చంద్రబాబు ఈనెల 12న ఉదయం 11:27 గంటలకు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి శ్రీశైలం, తిరుమలకు చెందిన వేద పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఇదే వేదికపైనే నలుగురు మంత్రులు కూడా ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ప్రమాణ స్వీకార వేదిక మారడం విశేషం.