ఫైర్ స్టార్స్ కాస్తా పూల్స్ స్టార్స్ అయ్యారు

అత్యుత్సాహం జీవితం లో చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది అనడానికి నిదర్శనం ,ఇప్పటి వైసీపీ నాయకులే ... ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోతే పేరు మార్చుకుంటానని ఒకరు, మీసం గీయించుకుంటానని మరొకరు, రాజకీయ సన్యాసం చేస్తానని ఇంకొకరు.. ఇలా చాలామంది శపధాలు చేశారు. వైసిపి ఓడిపోయేసరికి కనీసం ముఖం చూపించేందుకు కూడా వీరు బయటకు రావడం లేదు.దీంతో అదే పనిగా వారు టార్గెట్ అవుతున్నారు.పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటారని కాపు ఉద్యమ నేత ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను గెలవనివ్వనని కూడా సవాల్ చేశారు. కానీ ఏకంగా 70000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు.దీంతో ముద్రగడ పద్మనాభం టార్గెట్ అయ్యారు. పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ ఎక్కువమంది ప్రశ్నించారు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. పేరు మార్చుకోనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గెజిట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడు లో పరిటాల సునీత గెలిచినా, రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాకపోయినా తన మీసం గీసుకుంటానని సవాల్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు చేసిన సవాల్ రికార్డ్ అవుతుందని.. తప్పకుండా చేస్తామంటేనే శపధం చేయాలని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పదేపదే చెప్పారు. ఈ సవాల్ ను స్వీకరిస్తానని కూడా ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. రాప్తాడు లో ప్రకాష్ రెడ్డి ఓడిపోవడంతో పాటు రాష్ట్రంలో వైసిపి దారుణ పరాజయం పాలయ్యింది. దీంతో ఆయన మీసం ఎప్పుడు తీస్తారా? అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అయితే ప్రకాశ్ రెడ్డి మీసం తీసినట్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన తీశారా? లేదా? అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు.తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా, వైసిపి ఓటమి చవిచూసినా రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. గుడివాడలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాలేదు. పైగా దారుణ పరాజయం ఎదురయింది. అందుకే ఇప్పుడు కొడాలి నాని రాజకీయ సన్యాసం చేయాలన్న డిమాండ్ పెరిగింది. కొడాలి నాని రాజకీయం సన్యాసం చేయవా అంటూ కొంతమంది ఆయన ఇంటిపై దూసుకెళ్లారు కూడా. ఆ సమయంలో నాని ఇంట్లో ఉన్నా స్పందించలేదు.దీంతో ఆయన సంకట స్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.నరసాపురం ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ సైతం ఇటువంటి శపధం చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. ఈ సవాల్ కు కట్టుబడి ఉంటానని కూడా తేల్చి చెప్పారు. నరసాపురం ఎంపీగా ఓడిపోయారు. కానీ తన సవాల్ కు కట్టుబడి ఉంటానని ఇప్పటివరకు ప్రకటించలేదు. కనీసం బయటకు కనిపించడం లేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వీరి మాటలకు అంతే లేకుండా పోయింది. కనీసం వీరు ఓటమిని అంచనా వేయలేకపోయారు. వైసిపి గెలుపుపై ధీమా వ్యక్తం చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు సవాళ్లకు కట్టుబడలేక ఇళ్లకే పరిమితం అయ్యారు.