గుంటూరు కారం ఎంత ఘాటుగా వుంది :-ఫుల్ మూవీ రివ్యూ

సంక్రాంతి బరిలో మహేష్ బాబు సినిమా అంటే ఫాన్స్ అందరికి పండగే  . అందులోనూ.. గురూజీ, మహేష్‌జీలది ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కమర్షియల్ హిట్ పక్కా అనే ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్. రమణగాడ్ని చూడగానే మజా వస్తుంది.. హార్ట్ బీట్ పెరుగుతుంది.. ఈల వేయాలనిపిస్తుంది అంటూ భారీ హైప్ పెంచేశారు మహేష్ బాబు.. మరి నిజంగానే విజిల్ వేయాలనిపించిందా? హాట్ బీట్ పెరిగిందా? మజా వచ్చిందో లేదో సమీక్షలో చూద్దా పాతికేళ్లుగా తల్లి పిలుపు కోసం ఎదురుచూసే గుంటూరు కుర్రాడి కథే ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ స్టైల్‌లో సినిమా కోసం మూడు ముక్కల్లో చెప్పాలంటే!! ఎప్పుడూ కిటికీలో నుంచి ఎవరికోసమో చూసే నాన్న.. తలుపులు వేసేసిన అమ్మ.. రోడ్డుమీదపడ్డ కొడుకు.. ఈ ముగ్గురి నడుమ ఓ విలన్.. మరో హీరోయిన్. క్లుప్తంగా ‘గుంటూరు కారం’ కథాంశం ఇదే. రమణగాడు అలియాస్ భోగినేని వెంకటరమణ (మహేష్ బాబు) గుంటూరు కారం లాంటి ఘాటైన కుర్రాడు. రమణకి ఐదేళ్ల వయసులోనే తల్లి వసుంధర (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్లిపోతుంది. తండ్రి సత్యం (జయరామ్) చేయని నేరానికి జైలుకి వెళ్తాడు. దాంతో రమణ.. అత్త (ఈశ్వరీరావు) దగ్గరే పెరుగుతాడు.తన తల్లి ప్రేమను పొందుకోవడం కోసం పాతికేళ్లుగా ఎదురుచూసిన రమణకి ఎట్టకేలకు తల్లి నుంచి పిలుపు వస్తుంది. అప్పటికే తన తల్లి వసుంధర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. తల్లి పిలిచిందని ఆశగా వెళ్లిన రమణకి ఊహించని ఘటన ఎదురౌతుంది. తల్లితో ఎలాంటి సంబంధం లేదని సంతకం చేయమని రమణను బెదిరిస్తాడు వసుంధర తండ్రి వెంకటస్వామి (ప్రకాష్ రాజ్). తల్లి ప్రేమను పొందడం కోసం సంతకం పెట్టకుండా ఎదురు తిరుగుతాడు రమణ. ఈ ప్రయత్నంలో రమణకి దగ్గరౌతుంది లాయర్ పాణి (మురళి శర్మ) కూతురు అమ్ము (శ్రీలీల).అసలు వసుంధర.. రమణని ఎందుకు వదిలేసి వచ్చింది? నారాయణ (రావురమేష్)ని రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? సత్యానికి ఎందుకు విడాకులు ఇచ్చింది? తల్లీ కొడుకులు కలుసుకోకుండా వెంకటస్వామి కుట్ర చేయడానికి కారణం ఏంటి? చివరికి ఆ తల్లి కొడుకులు కలుసుకున్నారా? లేదా అన్నదే మిగిలిన కథ.

1032-entry-1-1705048769.jpg

గుంటూరంటే పుట్టిన ఊరని మమకారమో ఏమో కానీ.. ‘గుంటూరు కారం’లో మహేష్ బాబు చెలరేగిపోయారు. సరిలేరు నీకెవ్వరు సినిమా అప్పుడు మహేష్ బాబు ఓ మాట అన్నారు. ‘నా నుంచి మాస్ మసాలా సినిమా రావడం లేదని ఫ్యాన్స్‌లో కంప్లైంట్ ఉంది.. ఈ సినిమాతో తీర్చేస్తా’ అని.. కానీ ఆ సినిమాతో ఫ్యాన్స్‌ కావాలనుకున్న మసాలా మీల్స్ సరిపోలేదు. అయితే ‘గుంటూరు కారం’ సినిమాతో ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మహేష్ బాబు. తన నుంచి అసలు సిసలు మాస్ మసాలాను ‘గుంటూరు కారం’లో అందించారు. లుక్స్, పెర్ఫామెన్స్, మాస్ అప్పీరెన్స్, కామెడీ టైమింగ్, బాడీ ఈజ్, డాన్స్, నెక్స్ట్ లెవల్. కానీ.. మహేష్ ఎంత మాస్ అవతారం ఎత్తినా.. క్లాస్‌ పాత్రలకు కనికట్టు చేసినంతగా మాస్ పాత్రల్లో ఇమిడిపోవడం కష్టం. అయినప్పటికీ కూడా రమణగాడిగా గట్టిగానే ఘాటు చూపించారు. నక్కిలీసు గొలుసు సాంగ్‌ కానీ.. ఇంటర్వెల్ ఫైట్‌ కానీ.. కుర్చీ మడత సాంగ్ కానీ.. నిజంగానే ఫ్యాన్స్‌ని కుర్చీలలో కూర్చోనీయలేదు.కథలో.. కథనంలో ఒడిదుడుకులున్నా.. బాధ్యతను తన భుజాలపై మోసి సినిమాని సేఫ్‌లో పడేయడంలో మహేష్ బాబు దిట్ట. ‘గుంటూరు కారం’ సినిమాలోనూ అదే మ్యాజిక్ చేశారు మహేష్ బాబు. రమణగాడి పాత్ర వరకూ ‘గుంటూరు కారం’ సినిమాకి ఫుల్ మార్కులే పడ్డాయి. ఆయన పెర్ఫామెన్స్‌ గురించి చెప్పేదేముంది.. ఫ్యాన్స్‌కి నచ్చినట్టు తనకి వచ్చినట్టు చేసుకుంటూ వెళ్లిపోతారు. ఆయన డైలాగ్ డెలివరీ ఒక్కొక్కరికి నచ్చుతుంది.. ఇంకొంతమంది నచ్చదు. నచ్చేవాళ్లే మేజర్ ఆడియన్స్ ఉండటంతో మహేష్ బాబు నటనకు మంచిమార్కులే పడుతుంటాయి. ఆయన ఇమేజ్, సోలో పెర్ఫామెన్స్‌తోనే నిలబడ్డ సినిమాలెన్నో ఉన్నాయి. గుంటూరు కారం సినిమా కూడా ఆ కోవలోనిదే.పొలిటికల్ నేపథ్యం ఉన్న కథను డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఎన్నికలకు ముందు అందులోనూ పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడిగా పేరొందిన గురూజీ.. పాలిటిక్స్‌ని టచ్ చేస్తున్నాడంటే.. అది అధికార పార్టీపై గురిపెట్టిన బాణంలా ఉండొచ్చనే సందేహాలు చాలామందిలో కలిగాయి. కానీ అందరివాడిగా పేరొందిన మహేష్ బాబుతో ప్రభుత్వాలను కెలికించే సాహసాన్ని చేయలేదు త్రివిక్రమ్. కుటుంబ కథా చిత్రానికి జస్ట్ పొలిటికల్ టచ్ ఇచ్చారంతే. విమర్శల జోలికి పోలేదు కానీ.. ఎమోషన్స్‌ని క్యారీ చేయలేకపోయారు. పాత్రలకు జీవం పోసే.. మహేష్ బాబు, రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, జయరామ్, ఈశ్వరీరావు.. లాంటి బలమైన కాస్టింగ్ ఉన్నా.. వాళ్ల నుంచి అబ్బా అనిపించేట్టుగా బలమైన సీన్లు లేకపోవడం గుంటూరు కారంలో ఘాటు తగ్గడానికి ప్రధాన కారణం. పాత్రలు ఎంట్రీ ఇచ్చినంత ఎంగేజింగ్‌గా ఎగ్జిట్ లేదు. పాత్రల్ని సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. కథతో పాటు పాత్రలు జర్నీ చేయలేకపోయాయి. అసలు జగపతి బాబు ఎందుకు ఉన్నారో.. అతనితో ఏం చేయించారో కూడా అర్ధం కాని పరిస్థితి.