ఒక కొలిక్కి వచ్చిన జనసేన టీడీపీ సమన్వయ చర్చలు
చిట్ట చివరకు ఒక కొలిక్కి వచ్చిన సమావేశమ్ ,ఏపీలో ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే. ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని పలు దశలలో చర్చలు జరిపాయి. మంగళవారం (నవంబర్ 13) తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది. ఆ భేటీలో మ్యానిఫెస్టోపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేనిఫెస్టో సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉంది. దీని మీదే కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేనిఫెస్టో కోసం టీడీపీ ఆరు అంశాలను ప్రతిపాదించగా, జనసేన పార్టీ ఐదు అంశాలను చేర్చారు. మొత్తం 11 అంశాలతో కూడిన ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం అయ్యింది. త్వరలోనే ఈ మేనిఫెస్టో ప్రకటిస్తామని కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల వెల్లడించారు. ఈ 11 అంశాలలో బీసీలకు రక్షణ చట్టం, అమరావతి రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహాకాలు, రద్దు చేసిన సంక్షేమ పథాకాలపై పునరుద్ధరణ, అసమానతలు తొలిగిపోయి ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు, సూక్ష్మ, చిన్న తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు రాయితీ వంటి ప్రధాన అంశాలున్నాయి.
ఈ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభి రాం పాల్గొనగా, జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. ఇది మినీ మేనిఫెస్టో మాత్రమే.. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలౌతుందనే వమ్మకం కలిగించడం కోసమే ఈ మినీ మేనిఫెస్టోను తీసుకొచ్చినట్లు ఇరు పార్టీలూపేర్కొన్నాయి. ఇక ఈ మేనిఫెస్టోలో యువతకు నమ్మకం కలిగించేలా ఉపాధి పథకాల ప్రస్తావన ఉంటుందన్నారు. సౌభాగ్య పథం పేరుతో యువత వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని, సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి వ్యూహ రచన చేస్తామని యనమల చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని, అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.
ఇక తెలుగుదేశం ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాల్లో తొలుత మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధి, 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500, తల్లికి వందనం పేరుతో ప్రతీ బిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ప్రతి ఒక్కరికి ఏటా 15 వేలు, దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితం, మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం, యువత కోసం యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3వేల నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ, అన్నదాత పేరిట రైతులకు ప్రకటించిన మేనిఫెస్టోలో ఏటా 20 వేలు ఆర్థిక సహాయం, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం వంటి పథకాలతో పూర్ టు రిచ్ పేరిట ప్రతి పేదవాడిని ధనికుడిని చేసేలా ప్రత్యేక కార్యాచరణను టీడీపీ ప్రకటించింది. మొత్తంగా టీడీపీ 6 ప్రధాన అంశాలు, జనసేన 5 ప్రధాన అంశాలతో మినీ మ్యానిఫెస్టో రూపకల్పనకు ఇరు పార్టీలు ఆమోదం తెలిపాయి.
కాగా, నవంబర్ 1 నుంచి మొత్తం 160 రోజుల పాటు ఈ మినీ మ్యానిఫెస్టో హామీల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఇరు పార్టీల నాయకులు, క్యాడర్ ఇంటింటికీ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర స్ధాయి నుండి క్షేత్రస్దాయి వరకూ ఇరుపార్టీల నేతలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేనిఫెస్టో అంశాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్ధాయిలో ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అలాగే మేనిఫెస్టో అంటే పేజీలకు పేజీలు రూపొందించి ప్రజలకు అర్ధం కాకుండా మాయ చేయడం కంటే.. సాధ్యమైనంత చిన్నదిగా.. అందులో ప్రజలకు అన్నీ కలిసి వచ్చేలా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ముందుగా ఈ మినీ మ్యానిఫెస్టోను సింపుల్ గా.. ఉన్నంతలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా.. ముఖ్యంగా సిద్ధాంతాలు అందరికీ అర్ధమయ్యేలా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అసలు మ్యానిఫెస్టో కూడా ఇదే తరహాలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి అజెండాగా రూపొందించనున్నారని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
Comments
0 comment