షుగర్ లెవెల్స్ ఇలా తగ్గించండి
సాధారణంగా సూర్యోదయ వేళ సమీపిస్తున్నకొద్దీ మన శరీరం నిద్ర నుంచి మేలుకోవటానికి సన్నద్ధమవుతూ వస్తుంది. ఈ క్రమంలో కొన్నిరకాల హార్మోన్లు పెద్దమొత్తంలో విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును అడ్డుకోవటం వల్ల రక్తంలో స్వల్పంగా గ్లూకోజు స్థాయులూ పెరుగుతుంటాయి. దీన్నే ‘సూర్యోదయ గ్లూకోజు సమస్య’ (డాన్ ఫెనామినా) అంటారు. నిజానికి చాలామందిలో ఇదేమీ హాని కలిగించదు. అయితే మధుమేహులకు మాత్రం సవాలుగా పరిణమిస్తుంది. ఎందుకంటే వీరిలో రాత్రిపూట సహజంగా ఇన్సులిన్ మార్పులను సరిదిద్దే సామర్థ్యం కొరవడుతుంది. దీంతో ఉదయం వేళల్లో గ్లూకోజు స్థాయులు నిరంతరం ఎక్కువగా ఉంటుంటాయి. రాత్రి 2 లేదా 3 గంటల సమయంలో వరుసగా కొన్ని రోజుల పాటు గ్లూకోజు స్థాయులను పరీక్షించుకోవటం ద్వారా దీన్ని గుర్తించొచ్చు. గ్లూకోజు ఎక్కువగా ఉంటుంటే రాత్రి భోజనాన్ని కాస్త ముందుగానే ముగించాలి. పడుకునే సమయంలో చిరుతిళ్లు తినటం మానెయ్యాలి. గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉంటూ.. చెమట పట్టటం, ఆకలి పెరగటం, తల తేలికగా అనిపించటం, వణుకు లేదా ఆందోళన వంటి లక్షణాలు కూడా కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Comments
0 comment