భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు భారీ ఊరట

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు భారీ ఊరట లభించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో అసాధారణ ప్రదర్శనతో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్.. చివరి క్షణంలో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫైనల్ ఆడకుండా ఆమెను ఒలింపిక్స్ నిర్వాహకులు డిస్ క్వాలిఫై చేశారు.ఈ అనర్హత వేటుపై వినేష్ ఫోగట్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. రూల్స్ ప్రకారమే నిర్దేశిత బరువుతో సెమీఫైనల్ చేరిన తనకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని లేకుంటే.. ఫైనల్ ఆడే అవకాశం ఇవ్వాలని అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్వీకరించింది. దాంతో ఆమె రజత పతకంపై ఆశలు చిగురించాయి.కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే రజతం పతకం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విభాగం పోటీలు ముగిసాయి. సెమీస్‌లో వినేష్ ఫోగట్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్ ఫైనల్ ఆడింది. బుధవారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్ 3-0తో క్యూబా రెజ్లర్‌ను చిత్తు చేసింది. దాంతో ఆమెకు స్వర్ణం దక్కగా.. గుజ్మన్‌కు రజతం దక్కింది.ఫస్ట్ రౌండ్‌లో వినేశ్ ఫోగట్ చేతిలో ఓడిన జపాన్ ప్లేయర్ సుసాకీ కాంస్య పతకం దక్కింది. వినేష్ ఫోగట్ డిస్‌క్వాలిఫై కావడంతో సుసాకీకి రేపిచేజ్ రూపంలో కాంస్యపోరు ఆడే అవకాశం దక్కింది. రెండో ఛాన్స్ రావడంతో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ 10-0తో ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్‌ను ఓడించింది.