దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెరిగిన పింఛన్లను అందిస్తుండగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.850గా ఉంది. మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంవల్ల ఏడాదికి రూ.2550 లబ్ధి వినియోగదారులకు చేకూరనుంది. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికా? ఈ పథకానికి అర్హులెవరనేది ప్రభుత్వం ప్రకటించబోతోంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చ జరిగింది. తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటే ఏపీలో 1.47 కోట్లమంది కార్డుదారులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారనే విషయంపై అధికారులు నివేదిక రూపొందించారు. మంత్రుల కమిటీ కూడా దీనిపై కొన్ని సిఫార్సులు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సిఫార్సులను ఆమోదించాల్సి ఉంది. ఆయన ఆమోదించిన తర్వాత వీటిని ప్రకటించబోతున్నారు.