కమ్మ సామజిక వర్గం అమ్మతో సమానం: రేవంత్ రెడ్డి

తెలంగాణ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న కమ్మ గ్లోబల్ సమిట్  కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్.లో శనివారం నాడు ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శనివారం నాడు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమానికి ఆలోచన రెండేళ్ళ క్రితం రూపుదిద్దుకుంది. మిత్రుడు కుసుమకుమార్‌కి రెండేళ్ళ క్రితమే ఏర్పాటు చేయాలని భావించారు. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు... 90 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ప్లాన్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కులం అనేది వృత్తినిబట్టి వచ్చేది. ‘కమ్మ’ అంటే అమ్మలాంటి వాళ్ళు. ఆకలి మీద వున్న వాళ్ళకి అమ్మలాగా అన్నం పెట్టే కులం ఇది. అమ్మ ఎవరిదైనా కడుపు చూస్తుంది. కమ్మ వాళ్ళు కూడా ఎదుటివారి కడుపు నింపాలని చూస్తారు. కమ్మవారు నేలతల్లని నమ్ముకుని, వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారం లాంటి పంటలు పంటలు పండించి, పదిమందికీ సాయం చేస్తారు. అందుకే ఒక సినిమాలో.. కొండపైన అమ్మవారు... కొండ కింద కమ్మవారు అని అన్నారు. కమ్మవాళ్ళు ఎక్కడ వున్నారో మనం గుర్తు పట్టాలంటే, పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన భూములు, సమృద్ధిగా నీరు ఎక్కడైతే వుంటుందో అక్కడ తప్పకుండా కమ్మవారు వుంటారు అని నేను నా మిత్రులతో అంటూ వుంటాను. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్నాటక అయినా.! కమ్మవారి ఆలోచన ఎప్పుడూ శ్రమించాలి, పంటలు పండించాలి.. పదిమందికీ ఉపయోగపడాలి.. పదిమందిని ఆదుకునే ఆలోచన చేయాలని అన్నదే కమ్మ కులంలో వున్న నేపథ్యం. అదే కమ్మ కులంలో వున్న డీఎన్ఏ. కమ్మ కులంతో నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నేను ఎక్కడ వున్నా నన్ను కమ్మవారు ఎలా అభిమానిస్తారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకునే నేను చాలా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ లైబ్రరీలో నేను చదువుకున్న చదువు నేను జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి ఉపయోగపడిందని నేను గట్టిగా చెప్పడానికి ఎంతమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మనకి అవకాశం ఇచ్చినవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నగా చేసి చూడటం పద్ధతి కాదు. ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వున్నారని అంటూ వుంటారు. కానీ, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయన ‘ఎన్టీఆర్’ అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ పాలిటిక్స్.లో ఒక బ్రాండ్.. ఎన్టీఆర్ లీడర్‌షిప్‌లో ఒక బ్రాండ్. వారు ఇచ్చిన అవకాశాల వల్లే ఆ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు వున్నారూ అంటే, ఎన్టీఆర్ ఆనాడు ఇచ్చిన అవకాశాలే కారణం. ఎన్టీఆర్‌ని అవమానిస్తూ మాట్లాడే వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆరే. అది ఎన్టీఆర్ లోపం, ఎన్టీఆర్ తప్పు కాదు.. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చారు.. అవకాశాన్ని అందుకున్నవాళ్లలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా వుండొచ్చు. అది వారి వారి విజ్ఞత. అలాగే ఎన్జీ రంగా, వెంకయ్య నాయుడు, అలాగే.. చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడి గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

కమ్మ కులస్తులు వ్యవసాయం నుంచి లాయర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు రాణిస్తున్నారు. సత్య నాదెళ్ళ దగ్గర మొదలుపెడితే, పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీల సీఈవోలుగా కమ్మవారు వున్నారు. అమెరికాలో తానా సోదరులు పెట్టే బహిరంగ సభల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశం జరపడం ఆనందకరం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడంలో కమ్మవారు కూడా భాగస్వాములుగా కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆహ్వానిస్తున్నాను. మీ కులంలో నిపుణులను, నైపుణ్యాన్ని అన్నిరకాలుగా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంసిద్ధంగా వుంది. హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారాలంటే, ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్నిరకాలుగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం వుంది. వాటిని కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా వుంది. అని చెప్పుకొచ్చారు