ముందస్తు వర్షాలు ఎందుకు పడుతున్నాయో తేల్చి చెప్పిన గోరంట్ల మాధవ్

“ఎండలు కొడితే.. సముద్రంలో ఉన్న నీటి ఆవిరి పైకి వెళ్తుంది. అది మేఘాలుగా మారుతుంది. శీతల గాలులు వీచినప్పుడు.. ఆ మేఘాలు కరుగుతాయి. చినుకుల రూపంలో భూమ్మీద వర్షిస్తాయి. ఇలా నైరుతిలో ఎక్కువ వర్షపాతం, ఈశాన్యంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది”.. ఇలానే కదా మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంది. ఇదే విధంగా కదా.. పెద్దలు, ఉపాధ్యాయులు మనకు చెప్పింది. కానీ, వర్షాలు కురుస్తున్నది అందుకు కాదట.. దానికి వేరే కారణం ఉందట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు ఏపీలోని అధికార పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్..గోరంట్ల మాధవ్ ఆ మధ్య ఒక వివాదాస్పద వీడియోతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఇటీవల పార్లమెంట్లో జరిగిన ఉదంతంలో.. కీలకంగా వ్యవహరించి మరోసారి వార్తల్లో నానారు. ఇటీవల ఎన్నికల్లో పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్నాయనగా.. తన సతీమణితో కలిసి తిరుపతి వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత.. అక్కడ విలేకరులు ఆయనను కలిశారు. దీంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో ముందస్తుగా కురుస్తున్న వర్షాలు దానికే సంకేతం అని ప్రకటించారు.“ఏపీలో ప్రస్తుతం ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా మారిపోయింది. మే నెలలో ఎండలకు బదులు వర్షాలు కురుస్తుండడం ఆనందాన్నిస్తోంది. రైతులు ఉత్సాహంగా పొలం పనులు చేసుకుంటున్నారు. ఇలా ముందస్తుగా వర్షాలు కురవడం వెనక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన పాలన వల్లే ఇదంతా జరుగుతోంది. సబ్బండ వర్గాలు సంక్షేమాన్ని అందుకుంటున్నాయి. ఆయన జన రంజక పాలన చూసి వరుణుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ముందస్తుగా వర్షిస్తున్నాడు. త్వరలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని” గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది.. వర్షానికి, జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.