ఫోన్ ట్యాపింగ్ కేసు మూలనపడ్డట్టేనా ?

తెలంగాణలో పెను సంచలనానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక నత్తనడకేనా? ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకరరావును ఇండియాకు రప్పించి విచారించడం జరిగే పని కాదా? అంటే తాజాగా వెలుగులోకి  వచ్చిన విషయాన్ని బట్టి చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. ఈ కేసులు ప్రధాన నిందితుడైన ప్రభాకరరరావు అమెరికా చెక్కేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత గత బీఆర్ఎస్ సర్కార్ లో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రాగానే ప్రభాకరరావు అమెరికా చెక్కేశారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ ఏడాది మార్చి 10న పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మరుసటి రోజే అంటే మార్చి 11న ప్రభాకరరావు అమెరికా వెళ్లారు. అప్పటి నుంచీ ఆయన అక్కడే ఉండిపోయారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ప్రభాకరరావు పేరు చేర్చి చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఇక అప్పటి నుంచీ ప్రభాకరరావును ఇండియాకు రప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. పాస్ పోర్టును  కూడా రద్దు చేశారు.ఈ నేపథ్యంలోనే ప్రభాకరరావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైన విషయం వెలుగులోనికి వచ్చింది.  అంటే ప్రభాకరరావు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి లభించింది.  దీంతో ఇక ఇప్పట్లో ప్రభాకరరావును భారత్ కు రప్పించే అవకాశాలు లేవన్న చర్చ జరుగుతోంది. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక నత్తనడేనని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో అనధికారికంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో  అధికారులు ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు వ్యాపారులు, కీలక వ్యక్తులఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.అసలు ఈ కేసులో ప్రభాకరరావును అరెస్టు చేసే విషయంలో పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన 24 గంటల వ్యవధిలో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారంటేనే.. ఆయనకు డిపార్ట్ మెంట్ నుంచి ఎప్పటికప్పుడు విషయాలు అందుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకరరావు అమెరికా చెక్కేసినప్పుడే ఆయన ఇప్పట్లో ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషణలు చేశారు.   ఈ కేసు  దర్యాప్తునకు ఆయన సహకించే అవకాశాలు లేవని న్యాయనిఫులు అభిప్రాయపడ్డారు. అన్నిటికీ మించి అమెరికా నుంచే జూబ్లిహిల్స్ పోలీసులకు ప్రభాకరరావు  లేఖలు రాసి గడువు కోరడాన్ని బట్టి చూస్తే  ఇక ఆయన తెలంగాణ రాష్ట్రంతో అనుబంధాన్ని తెంచుకుని అమెరికాలోనే సెటిల్ అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అప్పడే అంచనా వేశారు.  ఇప్పుడు అచ్చంగా అలాగే జరిగిందని ఆయన అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ కావడంతో తేటతెల్లమైందిజ