తెలంగాణా కురుస్తున్న భారీ వానలు ,సేదతీరుతున్న ప్రజలు

ఈవేసవి కాలంలో ఎండలతో మండిపోతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. 45 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రానున్న మూడు రోజులు ఊరట పొందే సమాచారం అందించింది. శనివారం(ఏప్రిల్‌ 20)నుంచి మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే అదే సమయంలో వడగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.ఇదిలా ఉండగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్‌ నగరంలోని మల్కాజిగిరి, కాప్రా, ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్‌.రావునగర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. శనివారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో వేడి గాలులు కూడా వీస్తాయని హెచ్చరించిందివాతావరణంలో మార్పు కారణంగా కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. రాబోయే మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం(ఏప్రిల్‌ 21)ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించిందిమన్నార్‌ గల్ఫ్‌ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి కొనసాగుతోంది. అది క్రమంగా కోమరిన్‌ ప్రాంతం నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే వాతావరణంలో మార్పులు జరుగుతాయని పేర్కొంది.