వంశి మెడకు మరో కేసు , పులుసు కారిపోతుందట ...పాపం

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఒకే రోజు మూడు వైపుల నుంచి తీవ్ర సెగ త‌గిలింది. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీ నేత స‌త్య‌వ‌ర్థ‌న్‌ను బెదిరించ‌డం.. అప‌హ‌రించ‌డం కేసులో నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌న్న‌వ‌రంలోని టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ మూక దాడి ఘ‌ట‌న తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఫ‌ర్నిచ‌ర్ స‌హా.. ప‌లు వాహ‌నాలు ద‌గ్థ‌మ‌య్యాయి. దీనిపై ఐటీడీపీ నాయ‌కుడు.. స‌త్య‌వ‌ర్థ‌న్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వైసీపీ హ‌యాంలోనే కేసు న‌మోదు చేసినా.. విచార‌ణ ముందుకు సాగ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక విచార‌ణ ప‌రుగులు పెట్టింది.అయితే.. స‌త్య‌వ‌ర్థ‌న్‌.. ఈ కేసును విత్‌డ్రా చేసుకుంటున్న‌ట్టు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇలా.. స‌త్య‌వ‌ర్థ‌న్ యూట‌ర్న్ ఎందుకు తీసుకున్నాడ‌న్న విష‌యంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అప‌హ‌రించి.. బెదిరించిన‌ట్టు గుర్తించారు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై మ‌రో కేసు పెట్టి హైద‌రాబాద్‌లో వంశీ స‌హా ప‌లువురుని అదుపులోకి తీసుకున్నారు. దాదా పు రెండు మాసాలుగా ఆయ‌న విజ‌య‌వాడ జైల్లోనే కాలం గ‌డుపుతున్నారు. అయితే.. కొన్నాళ్ల కింద‌ట బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్నా రు. అనేక విచార‌ణ‌ల త‌ర్వాత‌.. తాజాగా శుక్ర‌వారం స‌ద‌రు బెయిల్ పిటిష‌న్ను కోర్టు కొట్టివేసింది.బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి ప్రాతిప‌దిక క‌నిపించ‌డం లేద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. వంశీ బ‌య‌ట‌కు వ‌స్తే.. స‌త్య‌వ‌ర్థ‌న్‌ను చంపేసే ప్ర‌మాదం ఉంద‌న్న పోలీసుల త‌ర‌ఫు వాద‌న‌ల‌ను కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఈ క్ర‌మంలో బెయిల్ ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, 2వ ఘ‌ట‌న ఏంటంటే.. ఇదే కేసులో ప్ర‌స్తుతం రిమాండ్‌లో ఉన్న వంశీకి రిమాండ్ గ‌డువు.. ముగిసింది. దీంతో పోలీసులు ఆయ‌న‌ను కోర్టుకు హాజ‌రు ప‌రిచారు. ఒక‌వైపు బెయిల్ ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో ఆయ‌న రిమాండ్‌ను మ‌రో 14 రోజులు పొడిగిస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 9 వ తేదీ వ‌ర‌కు ఆయ‌న జైల్లోనే ఉండ‌నున్నారు.ముచ్చ‌ట‌గా మూడో విష‌యానికి వ‌స్తే.. వంశీపై మ‌రో కేసు న‌మోదైంది. కృష్ణాజిల్లా ఆత్కూరులో త‌మ భూమిని వంశీ క‌బ్జాచే శారంటూ.. ర‌మేష్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. వంశీని త‌మ‌కు అప్ప‌గించాలంటూ.. కోర్టులో పిటిష‌న్ వేశారు. వంశీని నాలుగు రోజుల పాటు విచారించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. అయితే.. కోర్టు ఒక రోజు క‌స్ట‌డీకి అప్ప‌గించేందుకు అనుమ‌తించింది. దీంతో వంశీని శ‌నివారం ఒక‌రోజు ఆత్కూరు పోలీసులు వంశీని క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించ‌నున్నారు. ఇలా.. ఒకే రోజు.. మూడు ఘ‌ట‌న‌ల్లో వంశీకి ఎదురు దెబ్బ‌లు త‌గల‌డం గ‌మ‌నార్హం.