బొద్దులూరి యశస్వి పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చేయండి :హైకోర్టు

ఎన్ఆర్ఐ, టీడీపీ నేత, తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వికి హైకోర్టులో ఊరట లభించింది. యశస్వి పాస్‌పోర్టును తక్షణం తిరిగి అప్పగించాలని మంగళగిరి సీఐడీ ఎస్పీ, తిరుపతి సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌స్పెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టు స్వాధీనం చేసుకునే క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 91, 102 నిబంధనలను పాటించలేదని ఆక్షేపించింది. వీసా రెన్యువల్‌ కోసం పిటిషనర్‌ కాన్సులేట్‌ ముందు హాజరుకావాల్సి ఉన్నందున.. పాస్‌పోర్టు వెంటనే విడుదలకు తామిచ్చిన ఉత్తర్వులను అధికారులకు తెలియజేయాలని సీఐడీ ప్రత్యేక పీపీకి సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో.. అమెరికా నుంచి వచ్చిన యశస్విని ఏపీ సీఐడీ హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా గుంటూరుకు తరలించారు.. ఈ క్రమంలో సీఐడీ అధికారులు యశస్వి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ చేసిన విమర్శలపై కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవన్నారు.సీఆర్‌పీసీ చట్ట నిబంధనలు పాటించకుండా పాస్‌పోర్టును సీజ్‌ చేసే అధికారం సీఐడీకి లేదన్నారు. వీసా రెన్యువల్‌ కోసం కాన్సులేట్‌ వద్ద పిటిషనర్‌ హాజరుకావాల్సి ఉందన్నారు. గైర్హాజరైతే స్లాట్‌ కోసం మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే పాస్‌పోర్టును అప్పగించేలా సీఐడీని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా పిటిషనర్‌ తరచూ పోస్టులు పెడుతున్నారన్నారు సీఐడీ ప్రత్యేక పీపీ. అందుకే అదుపులోకి తీసుకొని 41ఏ నోటీసిచ్చి, వదిలిపెట్టామన్నారు. 41ఏ నోటీసు షరతులను ఉల్లంఘిస్తూ మీడియాతో మాట్లాడారన్నారు.ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయడంతోపాటు అతని పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేసే క్రమంలో సీఐడీ అధికారులు చట్ట నిబంధనలు అనుసరించలేదని అభిప్రాయపడ్డారు. సీజ్‌ చేసిన పాస్‌పోర్టును అధికారులు సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు ఉంచకపోవడంపై ఆక్షేపించారు. తక్షణం పాస్‌పోర్టును పిటిషనర్‌కు అప్పగించాలని సీఐడీని ఆదేశించారు. యశస్విని మూడు రోజుల క్రితం ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకొచ్చారు. అక్కడ 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే సీఐడీ అధికారులు పాస్‌పోర్ట్ తీసుకోవడంపై యశ్ హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో కోర్టులో ఊరట లభించింది.