స్విర్జర్లాండ్ నుండి విశాఖకు వచ్చిన టూరిస్ట్ కి చేదు అనుభవం
విశాఖలో దారుణం చోటుచేసుకుంది ఇటీవల విదేశీయుడిపై దాడి ఘటన కలకలంరేపింది. యారాడ బీచ్‌లో పారాగ్లైడింగ్ చేసేందుకు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఓ యువకుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటనపై న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. స్విట్జర్లాండ్ నుంచి నోహ ఎల్లియాస్(24) పారాగ్లైడింగ్ చేసేందుకు టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. రెండు రోజుల హిమాచల్‌ప్రదేశ్ పర్యటన ముగించుకుని... బుధవారం తెల్లవారు జామున విశాఖ చేరుకున్నారు. నేరుగా యారాడ బీచ్‌కు చేరుకుని తీరంలో కొండలపై కూర్చుని బీచ్ అందాలు ఆస్వాదిస్తున్నాడు.అదే సమయంలో ముగ్గురు యువకులు అతడి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. విదేశీయుడు నిరాకరించారు. దీంతో అతడిపై దాడి చేసి... మొబైల్, పర్సు ఎత్తుకెళ్లారు. బాధితుడు యారాడలో స్థానికుల సాయంతో న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందించారు. క్రైం ఏడీసీపీ గంగాధరం, హార్బర్ ఏసీపీ మోజెస్ పాల్, క్రైం సీఐ శ్రీనివాస్, న్యూపోర్టు సీఐ ఎర్రన్నాయుడు, క్రైం ఎస్‌ఐ ప్రసాదరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.న్యూ పోర్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించగా దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మల్కాపురం సమీప జై ఆంధ్రకాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ప్రత్యేక బృందంతో నిందితుల కోసం గాలించారు.. వారిలో ఒకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విదేశీయుడిపై దాడి ఘటన విశాఖలో కలకలంరేపింది.
Comments
0 comment