దమ్ముంటే పట్టుకోండి పోలీసులకు సవాల్ విసిరిన దొంగ

పోలీసులకు ఎప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండదు ఎందుకంటే కళ్ల ముందు దొంగ ఉన్నా పట్టుకోలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది పోలీసులకు. అదేంటీ.. కనిపిస్తున్న దొంగను పట్టుకోలేకపోవటమేంటీ అనుకుంటున్నారా.. అయితే ఆ దొంగ ఉంది ఓ చెరువులో.. పోలీసులు ఉంది ఒడ్డున మరి. ఈ విచిత్ర ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. చోరీ కోసం ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే.. ఇంటిని దోచుకునేలోపే.. ఆ ఇంటి యజమాని వచ్చేశాడు. ఇక అక్కడ ఉంటాడా.. పట్టుకునేందుకు ప్రయత్నించిన యజమానిని పక్కకు తోసేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ తన అతి తెలివికి పని చెప్పాడు. ఎంత దూరం పరుగెత్తినా దొరికిపోతాననుకున్నాడో ఏమో.. పక్కనే కనిపిస్తున్న చెరువులోకి దూకేశాడు. ఈత కొట్టుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై మంచిగా తిష్ట వేశాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. దొంగను చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నానా విధాలుగా ప్రయత్నం చేశారు. బుజ్జగించినా, బతిమాలినా, బెదిరించినా.. ఎంతకు ఆ దొంగ బయటికి రాకుండా అక్కడే ఉన్నాడు. వీళ్లలో ఎవరైనా ఆ చెరువుతో దూకి పట్టుకుందామా అంటే.. అక్కడి నుంచి మళ్లీ చెరువులో దూకి ఎటు తప్పించుకుంటాడోనని.. ఆలోచించి ఆగిపోయారు. చల్లగా చలి పెడుతున్నా.. మరోవైపు చీకటి పడినా.. అక్కడి నుంచి దొంగా కదలట్లే.. అతడు ఎప్పుడు బయటకి వస్తాడా అని చూసుకుంటూ పోలీసులు కూడా అక్కడే ఉండిపోయారు. మరోవైపు.. ఈ విచిత్ర సన్నివేశాన్ని చూసేందుకు స్థానికులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.