కాంగ్రెస్ ఓటమికి కారణం అదేనా ?

హిందీ రాష్ట్రాలలో  కాషాయ జెండా రెపరెపలాడటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం కమలనాథులకు పవర్ కట్టబెట్టేలా చేస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు, బీసీల మద్దతుకు తోడు లాడ్లీ బెహ్నా స్కీమ్ బీజేపీ విజయానికి కారణంగా తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లో హోరాహోరీ పోరు జరిగినప్పటికీ బీజేపీ వైపు మొగ్గు కనిపిస్తోంది. అయితే అన్నింటికంటే ప్రధానంగా సనాతన ధర్మం ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ క్రిష్ణమ్ అభిప్రాయపడ్డారు.

క్యాస్ట్ బేస్‌డ్ పాలిటిక్స్‌ మన దేశంలో పనిచేయవన్న ఆచార్య ప్రమోద్.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం వలన కలిగిన శాపం ఇదని అభిప్రాయపడ్డారు.

"సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం వలన పార్టీ మునిగిపోయింది. మన దేశంలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడూ పనిచేయవు. ఇది కేవలం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన కారణంగా కలిగిన శాపం ఫలితం"... అంటూ ఆచార్య ప్రమోద్ తెలిపారు.

రాజస్థాన్ సంగతి పక్కనబెడితే మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పూర్తి విశ్వాసంతో ఉండేవారు. అయితే ఫలితాలు వారికి షాక్‍ ఇచ్చాయి. మధ్యప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను పూర్తిగా కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్‌లకు అప్పగించారు. అయితే బీజేపీ సోషల్ ఇంజినీరింగ్, పథకాల ముందు గ్రాండ్ ఓల్డ్ పార్టీ నిలబడలేకపోయింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ అగ్రనేతలు అందరూ మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో కీలకంగా వ్యవహరించారు. కేంద్రమంత్రులు సైతం ఎన్నికలబరిలో దిగారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందంటూ చేసిన ప్రచారం కూడా కమలనాథులకు కలిసి వచ్చిందనే చెప్పాలి.