లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో కీలక ఆధారాలు లభ్యం
తెలంగాణా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల పఠాన్ చెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ ప్రమాదంలో ఆమె వ్యక్తిగత సహాయకుడు/ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతంలోని సిసి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. హై ప్రొఫైల్ కేస్ కావడంతో ప్రభుత్వం ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు? ప్రమాదం జరిగిన తర్వాత వాహనంలో కొన్ని భాగాలు ఎందుకు చాలా దూరంగా పడ్డాయి? ఇవన్నీ దర్యాప్తు బృందానికి అనుమానం కలిగించాయి. దీంతో వారు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే కు సంబంధించిన బంధువులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానాలు చెప్పడంతో ఒకింత ఆందోళన నెలకొంది. ఎమ్మెల్యే మృతికి సంబంధించి ఏదైనా కుట్ర జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణించిన కారు ముందుగా ఒక వాహనాన్ని ఢీ కొట్టి, ఆ తర్వాత రెయిలింగ్ ను ఢీ కొట్టిందని భావించారు. అయితే ఆమె ఏ వాహనాన్ని ఢీ కొట్టిందో పోలీసులు అప్పట్లో గుర్తించలేకపోయారు. లాస్య నందిత వాహనం ఢీ కొట్టిన టిప్పర్ ను దర్యాప్తు బృందం గుర్తించింది. దానిని సీజ్ చేసింది. అయితే ఆ టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు.ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఆమె వ్యక్తిగత సహాయకుడు ఆకాష్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతకుముందు రాత్రి వాళ్ళు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావడం.. రాత్రి మొత్తం మెలకువతో ఉండడం.. తెల్లవారుజామునే ప్రయాణం ప్రారంభించడంతో.. అతడు నిద్రమత్తుకు గురై.. టిప్పర్ ఢీకొన్నాడని.. సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ఎమ్మెల్యే మరణించారని పోలీసులు అంతర్గతంగా పేర్కొంటున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు. సాయన్న మరణం తర్వాత భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆమెకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ఆ స్థానం నుంచి విజయం సాధించారు. తన తండ్రి మరణించి ఏడాది పూర్తయిన కొద్ది రోజులకే ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Comments
0 comment