మాజీ సీఎం కెసిఆర్ ని కలిసిన రేవంత్ రెడ్డి

ఎంతో ఎదిగిపోయిన రేవంత్ ,ఇది నిజం అందరు అనుకునే మాట ఎందుకంటే బాత్‌రూంలో జారిపడి.. హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సరామర్శించారు. మధ్యాహ్నం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను కలిసి కాసేపు మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ఆసెంబ్లీకి రావాలని ఆకాకంక్షించారు. అనంతరం అక్కడే ఉన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈమేరకు సీఎస్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు వెల్లడించారు.కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరానని సీఎం రేవంత్‌ చెప్పారు. ప్రజాపాలనలో కేసీఆర్‌ సలహాలు, సూచనలు తీసుకుంటామని.. కేసీఆర్‌ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులను ఆదేశించామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ కూడా వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా సోమాజీగూడ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.