మేడారం జాతర :గట్టమ్మ కు ఎందుకు మొక్కులు చెల్లిస్తారో తెలుసా ?
తెలంగాణా లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఎందుకు గట్టమ్మను దర్శించుకుంటారు. గట్టమ్మ వద్ద ఆగి దర్శనం చేసుకోకుంటే సమ్మక్క సారలమ్మల మొక్కులు చెల్లవని నమ్ముతారు. గట్టమ్మ సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా ఉండే వారని, కాకతీయ రాజులతో యుద్ధం జరిగిన సమయంలో మేడారం పొలిమేరలో ఉండి మేడారం రక్షణకు వీరోచితంగా యుద్ధం చేశారు గట్టమ్మ తల్లి. గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారిక కోసం కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా తన శౌర్య, పరాక్రమాలను ప్రదర్శించింది గట్టమ్మ తల్లి.కాకతీయ సేనలను గడగడలాడించిన గట్టమ్మ సమ్మక్కకు అత్యంత ప్రియమైన అంగరక్షకురాలు. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో నవ గట్టమ్మలు మేడారం రాజ్యానికి కాపలా కాశారని, అయితే అందరిలోకి పెద్దమ్మ ములుగు సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లి కావడంతో అందరికంటే ఆమెకే అత్యంత ప్రాధాన్యత దక్కిందని ఆదివాసీ నాయక్ పొడ్ పూజారులు చెప్తారు. సమ్మక్క తల్లికి అంగరక్షకురాలుగా గట్టమతల్లితో పాటు, సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు కాకతీయులతో జరిగిన యుద్ధంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వీరోచితంగా పోరాడి అమరులయ్యారు.కాకతీయ సేనలు మేడారంలో కాలు పెట్టాలంటే ముందు పొలిమేరలో ఉన్న గట్టమ్మ తల్లిని దాటి పోవాల్సిందే. కాకతీయ సేనలను ముప్పతిప్పలు పెట్టి, తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన గట్టమ్మ సమ్మక్క తల్లి కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన త్యాగమూర్తి. గట్టమ్మ తన చివరి శ్వాస వరకు సమ్మక్క తల్లికి రక్షగా పనిచేసింది. అందుకే గట్టమ్మ తల్లికి ఇంతటి ప్రాశస్త్యం. నాడు సమ్మక్క కోసం అమరవీరులైన గిరిజనులను సైతం నేటికీ పూజిస్తున్న సంస్కృతి ఆదివాసులది. ఈ క్రమంలోనే గేట్ వే ఆఫ్ మేడారం గా చెప్పుకునే గట్టమ్మ తల్లి ఆలయం వద్ద విశేషంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి పూజలు నిర్వహిస్తున్నారు.మంత్రాలు ఏమీ లేకుండా కేవలం బండారితో అమ్మవారికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు. సమ్మక్కకు అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి గట్టమ్మ తల్లి కావడంతో తొలిమొక్కులు ఆమెకే చెల్లించుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. గట్టమ్మ దగ్గర ఆగకుండా తొలిముక్కలు చెల్లించకుండా వెళ్ళిన వారికి సమ్మక్క సారలమ్మల దర్శన ఫలం లభించదని చెబుతారు అందుకే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులు ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే అమ్మల చెంతకు వెళతారు. గట్టమ్మ ఆశీర్వాదం ఉంటేనే మేడారం జాతరలో అమ్మవార్ల దర్శనం దక్కుతుందని నమ్ముతారు.
Comments
0 comment