ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR ఎందుకీ ఉలికిపాటు ?
తెలంగాణలో ఎన్నికలు అయిపోయినా సరే రాజకీయాలు చాలా రసవత్తరం గా మారాయి ,అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఇతర అవినీతి అంశాలపైనే ఎక్కువగా ఫోక్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులను అరెస్టు చేసి విచారణ చేయిస్తోంది. బీఆర్‌ఎస్ పాలనలో చేసిన తప్పిదాల కూపీ లాగుతోంది. బీఆర్‌ఎస్ కీలక నేతల పేర్లు బయటకు వచ్చే వరకూ వదిలేలా కనిపించడం లేదు.కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ అంశం నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు టార్గెట్‌గానే విమర్శలు చేస్తున్నారు. ఈమేరకు వరుసగా డీజీపీని కలుస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేకే.మహేందర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నేతలు రఘునందన్‌రావు, చీకోటి ప్రవీణ్‌తోపాటు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలక నిందితుడు అయిన నందకుమార్ కూడా తమ ఫోన్లను బీఆర్‌ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఫిర్యాదు చేశారు. చీకోటి ప్రవీణ్ అయితే బాధితులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.ఇదిలా ఉండగా, కేటీఆర్ ఆదేశాలతోనే పోలీసులు రాజకీయ నాయకులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే నాగచైతన్య, సమంత విడిపోయారని ఆరోపించారు. రోజు రోజుకూ కేటీఆర్‌నే కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో గులాబీ నేత ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్న ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదని, చేస్తే దొంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చని పేర్కొన్నాడు. తర్వాత తనపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా హీరోయిన్‌ను బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని, హీరోయిన్లను బెదిరించాడని ఓ మంత్రి మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాంటి ఆరోపణలకు భయపడనని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని మరోమారు హెచ్చరించారు. ఆరోపణలు చేసేవారిని వదిలిపెట్టనని అన్నారు.
Comments
0 comment