సీఎం రేవంత్ ని కలుసుకున్న మాజీ డీ.ఎస్.పి నళిని

మాజీ డీఎస్పీ, తెలంగాణ ఉద్యమకారిణి నళిని ,ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం (డిసెంబర్ 30) సచివాలయానికి వచ్చిన నళిని.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. తాను రాసిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో ‘నా అన్నాదమ్ముళ్ల లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేను’ అంటూ గొంతెత్తి, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి, వార్తల్లో నిలిచారు దోమకొండ నళిని. అధికారులు వివరణ కోరితే.. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేశారు. నాడు డీఎస్పీగా నళిని చేసిన త్యాగం ప్రభుత్వాలనే కదిలించింది. ఉద్యమాన్ని మరో స్థాయికి చేర్చింది.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సీఎం రేవంత్ రెడ్డి నాటి ఉద్యమకారులను గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని అధికారులకు సూచించారు.తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, తిరిగి విధుల్లో చేరలేనని నళిని ఇప్పటికే ప్రకటించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుతానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే, రేవంత్ రెడ్డి ఆమెకు ఎలాంటి హామీ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది.