తెలంగాణ మాజీ బి.ఆర్.ఎస్ మంత్రుల ఆఫీసుల్లో దొంగలు పడ్డారు ? కీలక ఫైళ్లు మాయం ?
బిఆఆర్ ఎస్ నాయకుల బాగోతాలు తెలిసిపోతాయి అని ఈ పని చేస్తున్నారా ? లేక తప్పులను కప్పి పుచ్చే ప్రయత్నమా ?
బిఆఆర్ ఎస్ మాజీ మంత్రుల ఓఎస్డీ కార్యాలయాల్లో దొంగలు పడ్డారు. కీలక ఫైళ్లను ఎత్తుకెళ్లిపోయారు. మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోగా.. బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కార్యాలయంలోని ఫైళ్లు మాయం కాగా.. ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఫైళ్లు నిన్ననే మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలోని కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ ఫైళ్లను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు.ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ.. పలు ఆధారాలను సేకరించారు. ఆ శాఖ డైరెక్టర్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ప్రశ్నించగా.. ఫైల్స్ కనిపించకుండా పోవటంపై తనకు ఎలాంటి సమాచారం లేదని సమాధానం ఇచ్చారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పశు సంవర్ధక శాఖ కేసులో ఓఎస్డీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కొన్ని ఫైల్స్ కావాలనే చింపేసినట్లు గుర్తించామన్నారు. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారని.. వాచ్‌మెన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.
ఇంకా వుంది
ఇదిలా ఉంటే.. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కొట్టిపారేస్తన్నారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలైందని.. మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని తెలిపారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ తెలిపారు.
ఇంకా వుంది
ఇదిలా ఉంటే.. బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో కొందరు దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. ఆటోలో ఫైళ్లను ఎత్తుకెళ్లేందుకు ఆగంతుకులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉండటం గమనార్హం. కాగా.. ఆటోలో ఫైళ్లు తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో.. అధికారులను చూసిన దుండగులు.. ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆటోలో ఉన్న ఫైల్స్ ఎవరివి, ఎక్కడివి.. ఎక్కడికి తరలిస్తున్నారు అనేది తెలుసుకుంటున్నారు.
Comments
0 comment