అన్నదమ్ములకు ఆదర్శం ఈ అన్నదమ్ములు

పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలక భాగస్వామి అయ్యారు. పొత్తు పెట్టుకోవడం, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపులో పవన్ పాత్ర కీలకం. అందుకే ఈసారి ప్రమాణస్వీకారంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకం. సీఎంగా నాలుగో సారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పవన్ మంత్రిగా తొలి ప్రమాణం చేశారు. అయితే పవన్ ప్రమాణం చేసిన సమయంలో ప్రాంగణమంతా మార్మోగింది.వేదికపై ఉన్న మెగాస్టార్ చిరంజీవి,ప్రాంగణంలో ఉన్న పవన్ భార్య,రామ్ చరణ్ ఆనందోత్సవాలతో చప్పట్లు కొట్టారు. అటు పవన్ సైతం ఎటువంటి బెరుకు లేకుండా ప్రమాణం చేయడం విశేషం.ప్రమాణ స్వీకార అనంతరం ప్రధాని మోదీతో కరచాలనం చేశారు పవన్ కళ్యాణ్. కాలికి నమస్కరించే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని వద్దని వారించారు. పవన్ ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అనంతరం చంద్రబాబుకు పవన్ నమస్కరించగా.. ఆయన దగ్గరకు తీసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేశారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నమస్కరిస్తూ ముందుకు సాగారు పవన్.వేదిక చివర్లో అమిత్ షా, జేపీ నడ్డా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరిలు కూర్చున్నారు. అమిత్ షా వద్దకు వెళ్ళిన పవన్ కాలికి మొక్కి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అమిత్ షా సైతం వద్దని వారించారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అయితే ఆ తరువాత ఉన్న మెగాస్టార్ ను పట్టించుకోని పవన్ నమస్కరించుకుంటూ ముందుకు సాగారు. దీంతో అక్కడున్న వారితో పాటు ప్రాంగణంలో ఉన్న మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చివరివరకు అతిథులకు నమస్కరిస్తూ వెళ్లిన పవన్.. తిరిగి వచ్చి చిరంజీవి కాళ్లకు నమస్కారం పెట్టారు. కానీ మెగాస్టార్ వద్దని వారించారు. దీంతో పవన్ చర్యలపై అక్కడున్న వారు ఫిదా అయ్యారు. చిరంజీవిపై పవన్ కున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికైతే పవన్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి.