తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జడ్జి పై దాడి చేసిన నిందితుడు

అమెరికాలోని నెవాడా కోర్టు(Nevada Court)లో మహిళా న్యాయమూర్తిపై ఓ నిందితుడు భౌతిక దాడికి తెగబడ్డాడు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా న్యాయపీఠంవైపు దూసుకొచ్చాడు నిందితుడు రెడెన్. ఆమెపైకి దూకి ఆమెను వెనక్కి నెట్టేశాడు. ఈ ఘటనలో సదరు మహిళా జడ్జీకి స్వల్ప గాయాలయ్యాయి.వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. కోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడెన్ గత ఏడాది ఓ క్రిమినల్ కేసులో అరెస్టు కాగా.. పోలీసులు క్లార్క్ కౌంటీ డిటెన్షన్ సెంటర్‌లో బంధించారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే, ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా ఎంత కష్టమైన పనైనా సరే పూర్తి చేసేంత వరకు పట్టు విడవని వ్యక్తినని జడ్జీ ఎదుట తనని తాను పరిచయం చేసుకున్నాడు నిందితుడు రెడెన్. వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు అతడికి జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో 'నేను తిరుగుబాటు చేసే వ్యక్తిని కాదు. తప్పుడు కేసులో ఇరికించి నన్ను జైలుకు పంపారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నన్ను జైలుకు పంపిస్తారని అనుకోవడం లేదు. ఒక వేళ అదే మీ నిర్ణయం అయితే నిరభ్యంతరంగా వెళ్తాను' అని నిందితుడు పేర్కొన్నాడు.ఈ క్రమంలో జడ్జీ.. అతడ్ని జైలుకు పంపుతున్నట్లు ఆదేశాలు జారీ చేశాడు. అయితే, ఒక్కసారిగా కోపోద్రోక్తుడైన నిందితుడు రెడెన్.. జడ్జీవైపు దూసుకెళ్లాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడివారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని నిందితుడ్ని పట్టుకున్నారు. దుర్భాషలాడుతుండటంతో నిందితుడ్ని చితకబాదారు కోర్టు సిబ్బంది. ఆ తర్వాత పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.