ఆశ్చర్యం గుండెపోటుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ కన్నుమూత

ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూశారు. గుండె జబ్బులతో వచ్చిన ఎంతో మందికి నయం చేశారు.. ప్రాణాపాయ స్థితిలో వచ్చే వారిని కాపాడారు. కానీ ఆయన సైలెంట్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించడం విషాదాన్ని నింపింది. సోమవారం అర్ధరాత్రి తన స్వగృహంలో హాలులో అచేతనంగా పడి ఉన్నారు. భార్య సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది.

శ్రీనివాస ప్రసాద్ సైలంట్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంపై ప్రముఖ హృద్రోగ నిపుణుడు, ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ బాబు, ఇతర వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. విజయవాడలోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్‌లో సీనియర్‌ కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ భార్య గైనకాలజిస్ట్‌.. ఆయన వియ్యంకుడు డాక్టర్‌ వెంకట్రావు కార్డియాలజిస్ట్‌.

శ్రీనివాస ప్రసాద్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేల మంది గుండె జబ్బు రోగులకు సేవలందించారు. చిన్న కుమార్తె నెదర్లాండ్స్‌ నుంచి బుధవారం వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస ప్రసాద్ ప్రజలకు హృద్రోగ సమస్యలపై అవగాహన కల్పించేవారు.. ఆహార, ఆరోగ్య నియమాల గురించి రోగులకు చెప్పడమే కాకుండా తానూ పాటిస్తూ ఆదర్శంగా నిలిచేవారిని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.