కోడాలి నాని పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకట్రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.... పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరెజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాధవిలత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించారన్నారు. కొడాలి నాని అనుచరులు తమపై బెదిరింపులకు దిగారని చెప్పుకొచ్చారు. తమ గోడౌన్ లో ఉన్న లిక్కర్ కేసులను పగల కొట్టి తగలబెట్టారని... ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇదేం అన్యాయమని తన తల్లి సీతా మహాలక్ష్మి, వాసుదేవ రెడ్డితో ఫోన్లో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టారన్నారు.