పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ?

ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జీవితంలో అత్యంత ఉచ్చ స్ధితిలో ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం వెనుక, ఢిల్లీలో ఎన్టీయే ప్రభుత్వం రావడం వెనుక పవన్ కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లే టీడీపీ కూటమికి ఈ స్థాయిలో విజయం దక్కిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇక్కడ చంద్రబాబు, అక్కడ నరేంద్ర మోడీలు పవన్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్ల విపక్ష నేతగా ఉద్యమాలు, పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడిగానూ తన మార్క్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్‌కు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. నాటి నుంచి తన మార్క్ చూపిస్తున్నారు . వరుస రివ్యూలతో పాటు వాటికి అనుగుణంగా ఆదేశాలిస్తూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాంటే సినిమాలలో నటించినంత తేలిక కాదు. పూలు పడిన చోటే రాళ్లు పడుతుంటాయి.. ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి.పాలకుడిగా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కొందరికీ నచ్చవచ్చు, మరికొందరికీ నచ్చకపోవచ్చు. రాజకీయాల్లో ప్రత్యర్ధుల సంఖ్య ఎక్కువ. ఎంత సంయమనం పాటించినా టార్గెట్ చేసే వ్యక్తులు, పొంచి వుండే ముప్పులు ఎక్కువ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అడ్డుగోడగా నిలబడి.. జగన్‌కు 11 మంది ఎమ్మెల్యేలే దక్కడానికి పవన్ కళ్యాణే కారణమని ఆ పార్టీకి చెందిన కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి బాగోతాలను తవ్వి తీయాలని భావించడం కూడా కొందరికి ఆగ్రహం కల్పించిందని జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఎన్డీయేలో కీలక నేతగా ఉండటంతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి మద్ధతుదారుడు కావడంతో పవన్‌ను మావోయిస్టులు, కొన్ని రకాల శక్తులు టార్గెట్ చేశాయన్న వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే పవన్‌ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి, వీటి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అధికారంలోకి రావడానికి ముందు కూడా పవన్ పాల్గొన్న సభలు, ర్యాలీలలో భద్రతా వైఫల్యాలు కనిపించాయి. భద్రతా వలయాన్ని దాటుకుని మరి అభిమానులకు, ప్రజలకు పవన్ చాలా దగ్గరిగా వెళ్తారు. వారిలో సంఘ విద్రోహ శక్తులు ఉండే అవకాశం లేకపోలేదు. అందుచేత పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది , పోలీసులు ఇకపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్‌ కారును సమకూర్చింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో పవన్ భద్రతపై అభిమానులు, జనసేన కేడర్‌లో ఆందోళన నెలకొంది.