సభలో ఎల్‌కే అద్వానీకి శ్రద్ధాంజలి ఘటించిన కేంద్రమంత్రి.. ఆపై క్షమాపణలు

బీజేపీ దిగ్గజ నేత లాల్ కృష్ణ అద్వానీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 96 ఏళ్ల వయసు ఉన్న అద్వానీ ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే తాజాగా ఓ కేంద్రమంత్రి.. సభలో ప్రసంగిస్తూ ఎల్‌కే అద్వానీ చనిపోయారని ప్రకటించడం సంచలనంగా మారింది. 

అంతేకాకుండా అద్వానీ బతికి ఉండగానే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తప్పు తెలుసుకున్న కేంద్రమంత్రి.. చివరికి క్షమాపణలు చెప్పారు.

ఇటీవలి కాలంలో ఆయన రెండు సార్లు ఆస్పత్రిలో చేరి మళ్లీ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. 

అయితే ఈ ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా ఆయన అనారోగ్య కారణాలు, వయసు ప్రభావం కారణంగా రాలేకపోయారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 

ఇక ఇటీవల ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మోదీనే స్వయంగా ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వీ సోమన్న చేసిన పని తీవ్ర దుమారానికి కారణం అయింది.