నిజం ఒప్పుకున్న జగదీష్ అలియాస్ కేశవ

ఎపుడు జీవితం ఒకేలా ఉండదు ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతాయి . ఇప్పుడు నటుడు జగదీష్‌ పరిస్థితి అలాగే ఉంది. మల్లేశం చిత్రం నుంచి అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న జగదీష్‌ కెరీర్‌ను ‘పుష్ప’ టర్న్‌ చేసింది. పుష్ప సాధించిన విజయంతో అతనికి దేశవ్యాప్తంగా నటుడిగా గుర్తింపు లభించింది. దాంతోపాటే అవకాశాలు కూడా పెరిగాయి. సత్తిగాని రెండెకరాలు పేరుతో రూపొందిన ఓటీటీ సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో ఈ నెల 6న జగదీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ  మహిళ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో జగదీష్‌పై కేసు నమోదైంది.  పోలీసుల విచారణలో జగదీష్‌  తన నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.  గతంలో తనతో ఆ మహిళ చనువుగా ఉండేదని, ఇప్పుడు మరొకరితో కలిసి ఉండటాన్ని భరించలేకే వారిద్దరి ఫోటోలు తీసి ఆమెను బెదిరించానని ఒప్పుకున్నాడు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని మాత్రం ఊహించలేదని అన్నాడట. కేవలం ఆమెను దక్కించుకోవడానికే అలా చేశానని వెల్లడించాడట. 

 

అసలు జరిగింది ఇదీ.. ఆత్మహత్య చేసుకున్న మహిళా జూనియర్‌ ఆర్టిస్టు, జగదీష్‌ ఎప్పటి నుండో స్నేహితులు. సినిమాలు చేయడం ప్రారంభించిన దగ్గరి నుండి వీరిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు. అయితే జగదీష్‌ సినిమాలతో బిజీగా అయిపోవడం, ఆమెతో ఎక్కువ సేపు గడపలేకపోవడంతో వీరి మధ్య బ్రేకప్‌ అయ్యింది. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న జగదీష్‌ వారిద్దరి ఫోటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. అది తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె చనిపోవడానికి జగదీష్‌ కారణమని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జగదీష్‌ అరెస్ట్‌తో ‘పుష్ప2’ షూటింగ్‌కి అంతరాయం ఏర్పడట్టు తెలుస్తోంది. అతను లేకపోయినా షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదని మొదట యూనిట్‌ ప్రకటించినా అతను కనిపించే సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయని, అందుకే అతన్ని బెయిల్‌తో బయటికి తీసుకురావాలని మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.