బోరుగడ్డ అనిల్ అరెస్ట్

రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునే బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. 2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బోరుగడ్డ అనిల్ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఆయన కోసం పోలీసులు గాలించినా దొరకలేదు. ఆయన హైదరాబాద్, బెంగళూరులో కొంతకాలం తలదాచుకున్నట్లు ప్రచారం జరిగింది.. ఇటీవలే ఆయన గుంటూరుకు వచ్చారు. బోరుగడ్డ అనిల్‌పై గత ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని టీడీపీ ఆరోపించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై.. రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను బెదిరించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటంబసభ్యులు టార్గెట్‌గా అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. జగన్ ఒక్కసారి కనుసైగ చేస్తే చంద్రబాబును లేపేస్తానంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు కాలేదు.రాష్ట్రవ్యాప్తంగా బోరుగడ్డ అనిల్‌పై సుమారు 15 వరకు క్రిమినల్‌ కేసులు నమోదుకాగా.. అరండల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. అనిల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలియడంతో.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌ దగ్గరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. అనిల్‌‌కు రాచమర్యాదలు ఎందుకు చేస్తున్నారని పోలీసుల్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అనిల్ అరాచకం లేదని, నోటికొచ్చినట్లు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌తో పాటూ వారి కుటుంబ సభ్యుల్ని అసభ్యపదజాలంతో దూషించారన్్నారు. అనిల్‌పై ఎన్నో పోలీస్ కేసులున్నాయని.. అలాంటి వ్యక్తికి రాచమర్యాదలు చేస్తారా అంటూ మండిపడ్డారు. మరోవైపు తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని.. ఆయనకేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అనిల్‌ భార్య మౌనిక ఓ వీడియోను విడుదల చేశారు. అనిల్ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునేవారు. జగన్‌ను అన్న అంటూ పిలిస్తూ.. తనది పులివెందుల అని ప్రచారం చేసుకున్నారు. బోరుగడ్డ అనిల్‌పై గుంటూరులో ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో హంగామా చేయగా.. జూనియర్ డాక్టర్లు రెండు రోజుల పాటూ ఆందోళనకు దిగారు. అంతేకాదు గతంలో గుంటూరులో ఉన్న అనిల్ కార్యాలయాన్ని రెండుసార్లు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. అయితే అనిల్ ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించలేదు.. తాజాగా ఆయన్ను అరెస్ట్ చేశారు.