గ్రేటర్ పరిధిలో గ్రేట్ న్యూస్

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్ కార్డ్ చూపించి జీరో టికెట్ ద్వారా రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పించారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు. ఒకప్పుడు గ్రేటర్‌లో 12 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఇప్పుడా సంఖ్య డబుల్ అయింది. దాదాపు 25-30 లక్షల మంది ప్రతి రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక పెరిగిన రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం కొత్త బస్సుల కొనుగోలుకు మెుగ్గుచూపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో కొత్త బస్సులను తిప్పుతోంది. తాజాగా.. గ్రేటర్ పరిధిలో మరో 150 బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. అయితే అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లు, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.