వైసీపీ నేతకు కీలక పదవి కట్ట బెట్టిన పవన్

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నేతకు ప్రమోషన్ ఇచ్చారు. జనసేన పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించారు. జనసేన పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ బుధవారం నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఉదయభానుకు రాజకీయంగా విశేష అనుభవం ఉందని.. జనసేన పార్టీ కార్యక్రమాలను ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుభవం దోహదపడుతుందిని అధిష్టానం అభిప్రాయపడింది. ఆయనకు పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కీలక బాధ్యతల్ని అప్పగించిన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉదయభాను ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీలో అందర్ని కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు.సామినేని ఉదయభాను ముందు కాంగ్రెస్.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీల్లో సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా ప్రాతినిధ్యం వహించారు. ఉదయభాను 1999లో తొలిసారి కాంగ్రెస్ తరఫున పోటీచేసి జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. మళ్లీ 2004లో కూడా విజయం సాదించారు. 2009లో పోటీ చేయగా ఓడిపోయారు.. అయితే ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించగా.. మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు.. కానీ ఆయనకు జగన్ కేబినెట్‌లో స్థానం దక్కలేదు.. ఆయన్ను ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఉదయభాను 2023లో టీటీడీ పాలకమండలి నియమితులయ్యారు.