మానవత్వం చాటుకున్న మహిళ

ఓ మహిళ బంగారం ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఎక్కడ మర్చిపోయారో కూడా గుర్తులేదు.. ఇంతలో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీ బ్యాగ్ సురక్షితంగా ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పగానే ఆమె ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసుల్ని సంప్రదించి తన బ్యాగ్‌ను వెనక్కు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరగ్గా.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఇర్లపాడుకు చెందిన యానాదమ్మ హైదరాబాద్‌ నుంచి మర్రిపాడుకు బయల్దేరారు. ఆమె ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో వస్తుండగా.. నంద్యాలకు చెందిన శైలజ అదే బస్సులో ప్రయాణించారు. అయితే శైలజ తన బ్యాగును మరిచిపోయి బస్సు దిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత యానాదమ్మ తన పక్క సీట్లో ఈ బ్యాగును గుర్తించారు. వెంటనే తీసి చూడగా.. అందులో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లిన యానాదమ్మ పోలీసులకు అప్పగించింది.బస్సులో మర్చిపోయిన బ్యాగులో మహిళ వివరాలు ఉండటంతో.. వెంటనే కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే నంద్యాల నుంచి నెల్లూరు జిల్లా మర్రిపాడు రాగా.. పోలీసుల సమక్షంలో ఆభరణాలను తిరిగి అప్పగించారు. ఆ బ్యాగ్‌లో 9 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. బంగారం, వెండి ఉన్న బ్యాగ్ దొరికిన వెంటనే పోలీసులకు తీసుకొచ్చిన ఇచ్చి మానవత్వం చాటుకున్న యానాదమ్మను మర్రిపాడు పోలీసులు అభినందించారు. ఆమె నిజాయితీని అందరూ ప్రశంసించారు. తన బ్యాగ్‌ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు శైలజ కూడా యానాదమ్మకు ధన్యవాదాలు తెలిపారు.రెండు రోజుల క్రితం కూడా ఓ ఆర్టీసీ కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. ఓ మహిళ ఆర్టీసీ బస్సులో పర్సు మర్చిపోయి దిగారు. అయితే ఆర్టీసీ కండక్టర్ గమనించి.. ఆ పర్సును తీసుకెళ్లి డిపో మేనేజర్‌కు అప్పగించారు. పర్సు పోగొట్టుకున్న మహిళకు సమాచారం ఇచ్చి పిలిపించారు. ఆమె పర్సును తిరిగి జాగ్రత్తగా అప్పగించారు. ఆ పర్సులో బంగారంతో పాటుగా డబ్బులు కూడా ఉన్నాయి.