వివాదాల యానిమల్ ?

కలెక్షన్స్ పరంగా ఎలా దూసుకుపోతుందో ...వివాదాల పరంగా కూడా అలానే దూసుకుపోతుంది యానిమల్ మూవీ ,అర్జున్ రెడ్డి ’ చిత్రంతో టాలీవుడ్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించి అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. హీరో క్యారెక్టరైజేషన్‌ ఇలా కూడా చెయ్యొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేసి తన టాలెంట్‌ ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి బాలీవుడ్‌ ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ చిత్రాల తర్వాత రణబీర్‌కపూర్‌తో ‘యానిమల్‌’ సినిమా ఎనౌన్స్‌ చేయగానే అందరి దృష్టీ ఆ సినిమాపైనే పడింది. ‘యానిమల్‌’తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో అని అందరూ ఎదురుచూశారు. అందరూ ఊహించినట్టుగానే మొదటి షో నుంచే సినిమాపై చర్చ మొదలైంది. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమాకి సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది. వారం రోజుల్లో రూ.600 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా చూసినవారు సందీప్‌రెడ్డిని, హీరో రణబీర్‌ కపూర్‌ను, బాబీ డియోల్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకి ప్రశంసలు ఏ స్థాయిలో ఉన్నాయో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉండడం విశేషం. ఏవో కొన్ని సన్నివేశాలు బాగాలేదు అని కాకుండా సినిమా మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాలో చాలా బోల్డ్‌ సన్నివేశాలు ఉండడం, లైంగిక, గృహ హింసకు సంబంధించిన కంటెంట్‌ ఎక్కువగా ఉండడంతో విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి.

 

 

తాజాగా ఈ సినిమాపై ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎంపి రంజీత్‌ రంజన్‌ ఘాటుగా స్పందించారు. ఇటీవల ‘యానిమల్‌’ చిత్రాన్ని చూసిన తన కుమార్తె ఏడుస్తూ థియేటర్‌ బయటికి వచ్చిందని అన్నారు. ఈ సినిమా గురించి ఆయన స్పందిస్తూ ‘సినిమా అనే మాధ్యమం ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తుంది. సినిమా వల్ల ఎంతో మంది ప్రభావితం అవుతారు. ఇక కొంతమంది సినిమాలోని చెడును స్వీకరించడం ద్వారా ప్రభావితం అవుతారు. ముఖ్యంగా యువతపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈమధ్యకాలంలో యువతపై దుష్ప్రభావం చూపే సినిమాలు కొన్ని వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఏడుస్తూ బయటికి వచ్చిన మా అమ్మాయి సినిమా గురించి చాలా చెప్పింది. ఆమె చెప్పిన దాన్నిబట్టి ఈ సినిమా యువతపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అర్థమైంది. ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు 11, 12వ తరగతి పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. సినిమాల్లో చూపిస్తున్న హింసాత్మక ఘటనలు నిజజీవితంలోనూ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సినిమాలను జనం రోల్‌ మోడల్‌గా భావిస్తున్నారు. ‘యానిమల్‌’ చిత్రంలో ‘అర్జన్‌ వాయిలీ’ పాటను ఉపయోగించిన తీరును రంజీత్‌ తప్పుబట్టారు. పంజాబీ యుద్ధ గీతాన్ని సినిమాలో హీరో విధ్వంసం చేసే సన్నివేశంలో ఈ పాటను ఉపయోగించారు’ అన్నారు.