మండుతున్న ఆంద్రప్రదేశ్

ఏపీ భగ్గుమంటోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి.సూర్యుడు నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. ఒకపక్క ఎండ, మరోవైపు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. నడి వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే గత రెండు రోజులుగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఏపీ నిప్పుల కొలిమిగా మారింది.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 22 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 8న సైతం 22 మండలాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ యండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అత్యవసరం తప్పితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తాగునీరు, గ్లూకోజ్, కొబ్బరి నీరు వంటివి అధికంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఈరోజు తీవ్ర వడగాల్పులు వీచే మండలాలకు సంబంధించి.. శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరంలో 24, పార్వతిపురం మన్యంలో 11, విశాఖలో ఒకటి, అనకాపల్లిలో 7, కాకినాడలో 4, తూర్పుగోదావరి జిల్లాలో రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. కాగా శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కోట్కూరు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, ప్రకాశం జిల్లా తోకపల్లి, వైయస్సార్ జిల్లా బలపనూరులో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు జిల్లా గూడూరులో 44.6, విజయనగరం జిల్లా రాజాంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.