మొన్న జగన్ ,నిన్న బాబు ,ఈరోజు పవన్ ,ఎవరు చేస్తున్నారు ఈ రాళ్ల దాడి ?

ఆంధ్రలో అట్టుడికిపోతున్న రాళ్లదాడి రాజకీయాలు ,శనివారం రాత్రి జగన్ పాల్గొన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాళ్లదాడి.. దాన్ని మర్చిపోకముందే ఆదివారం తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్రలో రాయి తో దాడి.. దాన్ని మర్చిపోకముందే గాజువాకలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ప్రజా గళం సభలో రాళ్లదాడి.. కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పై రాళ్ల దాడి జరగడం, ప్రధాన పార్టీ నాయకుడు తృటిలో రాయి దాడి నుంచి తప్పించుకోవడం వంటి సంఘటనలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు గాజువాకలో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచార నిర్వహిస్తున్న నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో చంద్రబాబు నాయుడు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ రాయి విసిరిన వ్యక్తి ఎవరు? దాడి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అనే వివరాలు తెలియాల్సి ఉందని గాజువాక పోలీసులు చెబుతున్నారు. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటన మర్చిపోకముందే చంద్రబాబు నాయుడు పై అలాంటి ఘటన జరగడం విశేషం. సంఘటనా స్థలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసుల వైఫల్యం తోనే ఈ దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.వాస్తవానికి పెద్ద పెద్ద స్థాయి నాయకులు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఏదైనా ఆపద పొంచి ఉంటే నిఘావిభాగం వెంటనే అప్రమత్తం చేస్తుంది. పోలీసులకు సూచనలు ఇస్తుంది. నిన్న జగన్ పై దాడి జరగడం, ఆదివారం తెనాలిలో పవన్ కళ్యాణ్ త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడం, చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో రాళ్లు రువ్వడం వంటి ఘటనలు పోలీసుల వైఫల్యానికి నిదర్శనాలని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. “నిన్న జగన్మోహన్ రెడ్డి పై చీకటిలో గులకరాయి వేశారు.. ఇప్పుడు విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న నాపై రాళ్లు విసిరారని” చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో శాంతిభద్రతలు అదుపుతప్పుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాళ్లు వేసింది జగన్ గ్యాంగ్ అని.. చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖపట్నం ఓడరేవుకు మాదకద్రవ్యాలు దిగుమతి అయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. అందువల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టు తప్పాయని ఆయన విమర్శించారు.మరోవైపు చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్త మైనట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే అంతటి సభలో రాళ్లు రువ్వాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంత జన సందోహం ఉన్నప్పటికీ వారు అక్కడికి ఎలా వచ్చారు? ఆ సమయంలో రాళ్లు వారికి ఎవరు ఇచ్చారు? ఇదంతా పకడ్బందీగా జరిగిన ప్రణాళికేనా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇటు ముఖ్యమంత్రి, అటు ప్రతిపక్ష నాయకులపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఏపీలో కలకలం నెలకొంది.