మట్టిలో మాణిక్యం ,హోటల్ లో పనిచేస్తూ ఇంటర్ లో 918 మార్కులు
లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డుకాదు అని నిరూపించాడు ఓ యువకుడు ,. నిరుపేద కుటుంబంలో పుట్టి.. కనీసం తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తెలియని ఆ యువకుడు.. హాస్టల్లో చదువుకుంటూ, హోటల్లో పనిచేస్తూ నేడు అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. మట్టిలో మాణిక్యం అంటే ఇతనే అనే విధంగా ఇంటర్ ఫలితాల్లో అద్భుతం చేశాడు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఈ యువకుడికి ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చాయి.. అతని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి.. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజా కళాశాలలో పల్లె జాన్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 918 మార్కులు సాధించి కాకినాడ జిల్లా ప్రభుత్వ కళాశాలలో టాపర్ గా నిలిచాడు. ఇంతకీ ఈ జాన్ ఎవరు.. అతను ఇన్ని మార్కులు ఎలా సాధించాడు.. అతని బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోక మానరు.తెలివితేటలు ఉన్నా.. జాన్ కి చదువుకునే స్థోమత లేదు. తల్లిదండ్రులు కూడా లేరు.. దీంతో పెద్దమ్మ దగ్గర ఉంటూ ఒక హాస్టల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత హాస్టల్ పరిమితి అయిపోవడంతో. తుని జాతీయ రహదారి హెవిలీ దాబాలో పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థి రైటింగ్ చూసిన హోటల్ ఓనర్.. అతని గురించి ఆరా తీశాడు. చదువు మధ్యలో ఆపేసి కడుపు నింపుకోవడం కోసం పని చేస్తునట్లు తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలివైన యువకుడని గుర్తించి, చదువులో రాణిస్తాడని నమ్మాడు. దీంతో అప్పటికే కాలేజీలు ప్రారంభమైనా.. తనకున్న పలుకుబడితో జాన్ ను కళాశాలలో చేర్పించాడు.అప్పటి నుంచి ఒకపూట దాబాలో పనిచేస్తూ.. కాలేజీకి వెళ్తూ, రాత్రిపూట చదువుకున్నాడు. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఏకంగా ఈ ప్రభుత్వ విద్యార్థికి 918 మార్కులు రావడంతో అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. ఎన్నో కష్టాలు పడి.. ఉండటానికి ఇల్లు, కన్నవారు లేకపోయినా దాబాలో పని చేస్తూ చిన్నపాటి షెడ్డులో ఉంటూ ఇంత సక్సెస్ సాధించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు.. అన్ని సౌకర్యాలు కల్పించి, కార్పొరట్ కళాశాలలో చదివిస్తున్నా కనీసం పాస్ కూడా కారు. కానీ ఈ నిరుపేద కుటుంబంతో జీవనం కోసం పోరాడుతున్న ఈ యువకుడు మాత్రం కాలేజ్ టాపర్ అయ్యాడు. మట్టిలో పుట్టిన మాణిక్యం అంటూ కొనియాడుతున్నారు. తన తదుపరి చదువులకు దాతలు సహకారం అందిస్తే మరింత బాగా చదువుతానని జాన్ తెలిపాడు.
Comments
0 comment