అయోధ్యకి రాహుల్ ,ప్రియాంక

ఎన్నికల సిత్రాలు ఎన్నెన్నో చూడరా నరుడా ! అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే సమయం ఆసన్నం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. దీంతో అమేథీ, రాయ్‌బరేలీలో ఎవరు పోటీ చేస్తారు అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటికే వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో కూడా పోటీ చేస్తారని హస్తం వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక సోనియా గాంధీ సిట్టింగ్ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా బరిలో నిలుస్తారనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా.. తాజాగా మరో వార్త వైరల్‌గా మారింది. అమేథీలో రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా.. నామినేషన్లు వేయడానికి ముందు వారిద్దరూ కలిసి అయోధ్యను సందర్శించి బాలరాముడి ఆశీస్సులు తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ దూరంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అయోధ్యకు వెళ్తున్నారని వార్తలు రావడం ఎన్నికల వేళ తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.