అయోధ్యలో సీతారాములు కాకుండా బాలరాముడినే ఎందుకు ప్రతిష్టించారు ?

అయోధ్యలో సీతారాములు కాకుండా బాలరాముడే ఎందుకు ప్రతిష్టించారు ? ఇది చాలామందికి వచ్చిన ప్రశ్న ,అయితే ఈ విషయం మనము తెలుసుకుందాం  రామ మందిర ప్రారంభోత్సవం రోజున దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది. తొలి రోజు వీఐపీలు బాలక్ రామ్‌ను సందర్శించుకోగా.. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు ఏకంగా 5 లక్షల మంది భక్తులు అయోధ్య రాముణ్ని దర్శించుకున్నారు. ఇంకా వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో.. వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. మన దగ్గర భద్రాచలం, ఒంటిమిట్టలో ఉన్నట్టుగా సీతా, లక్ష్మణ సమేత రాముడి విగ్రహం కాకుండా.. బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఏంటనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగి రాజ్ అనే శిల్పి చెక్కిన సంగతి తెలిసిందే. సీతా రామ లక్ష్మణ హనుమంతుడి విగ్రహాలతో ఉన్న అరుణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని చాలా మంది భావించారు. కానీ బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారనే విషయమై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు పేరిట ఏర్పాటు చేసిన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు కనిపించింది. ‘అయోధ్యలో బాల రాముల వారిని ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు, సీత రాముల వారిని ఎందుకు చేయలేదని చాలా మంది అడుగుతున్నారు. దీనికి జవాబు ఏంటంటే.. సముద్రగుప్తుడు, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది, అప్పుడే రామ్ లాల్ల అని 5-6 అంగుళాల బాల రాముడి మూర్తి ఉండేది. కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా, తరువాత కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపితే అదే బాల రాముడి మూర్తి బయటపడింది. అంటే దాని అర్దం, ఇది మన చరిత్ర కదా..! మనం మళ్ళీ అదే స్థలంలో రాముల వారి కోసం ఆలయం పునః నిర్మిస్తున్నాం కదా.. అప్పుడు ఎవరికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, మన చరిత్రను పరిగణనలోకి తీసుకొని అదే బాల రాముల వారికి కదా చేయాలి. అందుకే బాల రాముల వారి వయసు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు’ అంటూ వివరణ ఇచ్చారు.