చంద్రబాబు వేసిన స్కెచ్ కు అదిరిపడుతున్న వైసీపీ

ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. పోలింగ్ నాటికి ప్రజలపై ప్రభావితం చూపే అన్ని అంశాలను, అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నారు. పొత్తుల అంశాన్ని సానుకూలంగా సర్దుబాటు చేసుకున్నారు. తక్కువ సీట్లతో జనసేన, బిజెపిని తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట బిజెపి ద్వారా అధికారుల బదిలీలు, ఎలక్షన్ క్యాంపెయిన్ వినియోగించుకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలోనే చంద్రబాబు చూపు మెగాస్టార్ పై పడింది. కూటమికి ఎలాగైనా చిరంజీవితో మద్దతు ప్రకటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చిరంజీవి కూటమిలో ఉన్న జనసేన, బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించారు. మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. జనసేనకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెనువెంటనే టాలీవుడ్ కు చెందిన హీరోలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ లోపు వీలైనంతవరకు టాలీవుడ్ ప్రముఖులతో కూటమికి మద్దతుగా ప్రకటనలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా టాక్ నడిచింది. ఇప్పటికే చిరంజీవి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. అయితే చివరి రోజు ఈ నెల 11న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. ఇందుకుగాను పదో తేదీ చిరంజీవి విజయవాడ చేరుకుంటారని.. చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా టాక్ నడుస్తోంది. తరువాత అదే రోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను వీక్షిస్తారని కూడా తెలుస్తోంది. 11న అక్కడ నుంచి నేరుగా పిఠాపురం ప్రచారానికి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జరుగుతోందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.