ఇవేమి ఎండలురా నాయనా ?

ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు, ఆపై ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిన్నటి వరకు రెమాల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడతాయని హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఇప్పుడు ఎండలు భారీగా ఉంటాయని హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఏపీలో ఎండలు మండుతున్నాయి. అయితే గత నెల రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతుండడంతో ప్రజలకు ఉపశమనం కలిగించినట్లు అయ్యింది. కానీ మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ స్థాయిలో ఎండలు కాస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.రెమాల్ తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. అయితే తుఫాను ప్రభావం తెలంగాణకు ఉన్నంత ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం సైతం 160 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది. నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నెలాఖరకు రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది.ఉత్తరాంధ్రలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం, పార్వతీపురం మన్యంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శ్రీకాకుళంలో మూడు మండలాలు, విజయనగరంలో ఐదు మండలాలు, పార్వతీపురం మన్యంలో నాలుగు మండలాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుందని.. వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రెమాల్ తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందస్తుగా చెప్పింది. కానీఆ తుఫాను ప్రభావం తెలంగాణ పై అధికంగా ఉంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఏపీలో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. రైతాంగానికి అవసరమైన స్థితిలో వర్షాలు పడటం లేదు. అయితే ఈ నెల చివరకు నైరుతీ రుతుపవనాలు కేరళ తీరానికి తాకుతాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో రుతుపవనాలు రాకతోనైనా వర్షాలు ప్రారంభమవుతాయని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతవరకు ఈ రాళ్లు పగిలే ఎండతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.