జయప్రకాశ్ నారాయణ్ మంచి మాట ...!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ గత మార్చి నెలలో మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని  ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. వైసీపీ  వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు విడుదల చేసిన ప్రకటనలో జెపి వివరణ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు వోటర్లకు డబ్బులు పంచుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  

 ‘ఓటు అనేది ఆ రోజు కలిగే ఆవేశంతోనో, ఆ పూట కలిగే కోపంతోనో, నేతలు ఇచ్చిన డబ్బు కోసమో, రేపు ఎవరో ఏదో ఇస్తారనే ఆశతోనో, మద్యం మత్తులోనో వేసేది కాదు. కొద్దిగా రేపేం జరగబోతోందో ఆలోచించి, జాగ్రత్తగా ఓటు వేయండి అని తెలుగు రాష్ట్రాల ఓటర్లకు సూచించారు.