"పవన్" ఆస్తులు ఎన్ని కొట్లో తెలుసా?

ఆంధ్రలో  నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటికే మూడో వంతు మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధ, గురువారాల్లో ఎక్కువమంది నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో కీలక నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. పులివెందుల నుంచి సీఎం జగన్, కుప్పం నుంచి చంద్రబాబు తరఫున కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి నుంచి లోకేష్ ఇంతకుముందే స్వయంగా నామినేషన్ వేశారు. ఇక మిగిలింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన, టిడిపి,బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆమె నామినేషన్ వేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పని చేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగానే శ్రమిస్తున్నారు. టిడిపి క్యాడర్ మొత్తం పవన్ గెలుపు కోసం శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పిఠాపురం నుంచి పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించడానికి మూడు పార్టీల శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేతలు తమ ఆస్తుల వివరాలను అఫీడవిట్లలో సమర్పిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తన ఆస్తులను ప్రకటించారు. చంద్రబాబు, లోకేష్ లు సైతం తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పైనే అందరి దృష్టి ఉంది. ఆయనకు ఉన్న ఆస్తులు ఎంత? అప్పులు ఎంత? అన్నది ఈరోజు తెలియనుంది. ఆఫిడవిట్లలో పొందుపరచాల్సిన అనివార్య పరిస్థితి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక సినిమా పారితోషికం 100కోట్ల పై మాటేనని తెలుస్తోంది. ఈ లెక్కన ఆయనకు భారీగా ఆస్తులు ఉంటాయని ఒక అంచనా. అయితే సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పార్టీని నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. ఒకానొక సమయంలో పిల్లల కోసం బ్యాంకులో ఉంచిన నగదును సైతం ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆస్తులెంత అనే బలమైన చర్చ నడుస్తోంది. కొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది.